విశాఖ మన్యం చింతపల్లి మండలంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన తాజంగి గ్రామంలో సివిల్, సీఆర్పీఎఫ్ సిబ్బంది కవాతు నిర్వహించారు. ఏఎస్పీ విద్యాసాగరనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం గ్రామ ప్రజలతో ఏఎస్పీ మాట్లాడారు. 17వ తేదీన జరగబోయే పంచాయతీ ఎన్నికలకు మన్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్వేచ్ఛగా, సంకోచం లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.
'పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు బందోబస్తు ఏర్పాటు చేశాం'
విశాఖ మన్యంలోని తాజంగి గ్రామంలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల బందోబస్తు చర్యలు తీసుకున్నామని చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగరనాయుడు వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
గ్రామ ప్రజలతో మాట్లాడుతున్న ఏఎస్పీ
గ్రామాభివృద్ధికి పాటు పడే వారినే సర్పంచిగా ఎన్నుకోవాలని ఏఎస్పీ అన్నారు. తాజంగి గ్రామం చుట్టు పక్కల ప్రదేశాలను డ్రోన్ కెమెరాతో వీక్షించి, తనిఖీ చేసి అధికారులకు భద్రతా చర్యలపట్ల సూచనలు ఇచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు గిరిజనులు సహకరించాలన్నారు. వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు ఎన్నికల నియమావళిని పాటించాలని.. ఎటువంటి గొడవలు జరగకుండా సంయమనంతో ఉండాలని కోరారు.