స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలంటూ ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు అందాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగానే మంత్రులు, రాజకీయ నాయకుల సమావేశాలకు అధికారులు హాజరు కాలేదు.
ఈనెల మొదటి వారంలో రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా..కోర్టు స్టే కారణంగా బ్రేక్ పడింది. తాజాగా 21న మళ్లీ కోడ్ అమల్లోకి వచ్చింది. గతంలో ఇచ్చిన షెడ్యూలు మాదిరిగానే 23న నోటిఫికేషన్ జారీ అవుతుంది. పంచాయతీ పోరు నాలుగు విడతలుగా జరపాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. అందుకు అనుగుణంగా విశాఖ జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
విశాఖ జిల్లాకు సంబంధించిన నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇందులో విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు, నర్సీపట్నం ఉన్నాయి. ఒక్కో దశలో ఒక్కో డివిజన్‌కు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉంది. అయితే ఏ విడతలో ఏ డివిజన్‌కు ఎన్నికలు నిర్వహించాలో ఖరారు కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఈరోజు వెలువడే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.