విశాఖ జిల్లాలో అక్రమ ఆక్వాసాగు(aqua culture) పెద్ద ఎత్తున జరుగుతోంది. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, రాంబిల్లి మండలాల్లో సుమారు వెయ్యి హెక్టార్లలో రొయ్యల చెరువులు సాగవుతున్నాయి. వీటిలో 30 శాతం చెరువులకే అనుమతులుండగా.. మిగతా వాటిని అనధికారికంగానే నిర్వహిస్తున్నారు. నదులు, ప్రభుత్వ భూములను ఆక్రమించి మరీ రొయ్యల, చేపల చెరువులను సాగు (aqua culture) చేస్తున్నారు. వాస్తవానికి సాగుకు పనికిరాని భూముల్లోనే చెరువులు ఏర్పాటు చేయాలి. కానీ జిల్లాలో మంచి దిగుబడినిచ్చే పంట భూముల మధ్య, నదీ ప్రాంతాలకు ఆనుకుని చేపలు, రొయ్యల చెరువులు సాగవుతున్నాయి. వీటికి తోడు పుట్టగొడుగుల్లా హేచరీలు, రొయ్యల శుద్ధి పరిశ్రమలు వెలుస్తున్నాయి. వీటి నుంచి వెలువడే ప్రమాదకర రసాయనాలను నేరుగా.. సాగు నీటి కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. ఈ ప్రభావం పల్లెలపై పడుతోంది.
పాయకరావుపేట మండలంలోని పాల్మన్‌పేట, రత్నాయంపేట, రాజానగరం, రాజవరం, పెంటకోట పరిధిలో 400 ఎకరాల విస్తీర్ణంలో చేపల, రొయ్యల చెరువులు సాగు (aqua culture) చేస్తున్నారు. వీటిలో చాలా వాటికి అనుమతులులేవు. రొయ్యల పెంపకానికి విచ్చలవిడిగా నిషేధిత మందులు వాడుతున్నారు. చెరువుల శుద్ధికి బ్లీచింగ్, ఫార్మాలిన్ ఇతర ద్రావణాలను వినియోగిస్తున్నారు. ఈ వ్యర్థాలను పైపుల ద్వారా పంపా నదిలోకి వదులుతున్నారు. దీంతో నీరు కలుషితమై (pollution) రంగు మారి.. తీవ్ర దుర్వాసన వస్తోంది. నదిలో చేపల లభ్యత తగ్గి.. ఉపాధి పోయిందని మత్స్యకారులు వాపోతున్నారు.