కరోనా కారణంగా రాష్ట్రంలో మార్చి 22 నుంచి బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. మే 21 న ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ.. కరోనా కేసులు అధికంగా ఉన్న విజయవాడ, విశాఖ నగరాల్లో మాత్రం బస్సులను రోడ్డెక్కించలేదు. సిటీ బస్సులు నడిపితే కేసులు పెరుగుతాయన్న వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికతో సర్వీసులను ప్రారంభించలేదు. సోమవారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నియామక పరీక్షలు జరుగుతున్నందున.. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ బస్సులను నడపాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్నాయని.. పరిస్థితి తీవ్రంగా లేదన్న ఆర్టీసీ అధికారులు.. విశాఖ, విజయవాడలో సిటీబస్సులు తిప్పేందుకు అనుమతి ఇవ్వాలని వైద్యఆరోగ్య శాఖను కోరారు. ఆ శాఖ సుముఖతతో పరిస్థితిని సమీక్షించి ప్రభుత్వం.. అనుమతి మంజూరు చేసింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ బస్సులు నడపాలని అధికారులను ఆదేశించింది.
విజయవాడ నగరంలో 450 సిటీబస్సులు ఉండగా నేటి నుంచి 100 సిటీ బస్సులను రోడ్డెక్కిస్తున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు కోసం ఆదివారం 300 బస్సులను.. సోమవారం నుంచి రద్దీని బట్టి బస్సులను నడపనున్నారు. విశాఖలో సుమారు వెయ్యి సిటీ సర్వీసులు ఉండగా..వాటిలో అవసరాన్ని బట్టి బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. రెండు నగరాల్లోనూ దాదాపు అన్ని రూట్లలో సిటీ బస్సులు నడపాలని నిర్ణయించారు. కొవిడ్ వ్యాప్తి చెందకుండా బస్సుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు.