ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Appalaraju Issue: బాధగా ఉంది సార్‌.. చొక్కా విప్పి కొడతాననడం కరెక్టేనా?

Appalaraju issue Audio viral: సీఐపై ఓ ప్రజాప్రతినిధి దుర్భాషలాడిన ఘటన తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ఓ మహిళా ఏఎస్సై ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని ఓ స్టేషన్‌లో పనిచేసే ఏఎస్సై వాయిస్‌ రికార్డు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎంత రాజకీయ నాయకుడైతే మాత్రం ప్రభుత్వ ఉద్యోగిపై నోరు పారేసుకుంటారా సార్‌ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

appalaraju issue
appalaraju issue

By

Published : Feb 11, 2022, 9:52 AM IST

Appalaraju issue: విశాఖపట్నం శారదాపీఠం వార్షిక మహోత్సవాల్లో భాగంగా బుధవారం విధుల్లో ఉన్న సీఐపై ఓ ప్రజాప్రతినిధి దుర్భాషలాడిన ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురయ్యాయని ఓ మహిళా ఏఎస్సై ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఓ స్టేషన్‌లో పనిచేసే ఏఎస్సై వాయిస్‌ రికార్డు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

‘సార్‌.. నమస్తే. మీరు పెద్దలు. మీతో కలిసి మాట్లాడాలన్నా అపాయింట్‌మెంట్‌ దొరకదు. ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. అందుకే నా మాటల్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి. నాలో భావం, బాధ మీరు అర్థం చేసుకోవాలి సార్‌. పోలీసు శాఖ అంటే అందరికీ లోకువేనా సార్‌? మీతో మాట్లాడుతున్నా ఏడుపు వస్తోంది. ప్రతిసారీ పోలీసులను బూతులు తిట్టడమేనా? మేము ఏదైనా చేస్తే మాత్రం పోలీసులే తప్పు చేశారంటారు. సీఎం ప్రోటోకాల్‌ ఎంత కష్టంగా ఉంటుందో మీరే చెప్పండి. మా విధులు మేము సక్రమంగా నిర్వహించకూడదా? ఓ ప్రభుత్వ ఉద్యోగిపై అలా తిరగబడొచ్చా? మీ బందోబస్తు అంటే ఉదయం నుంచే మేమంతా రోడ్లపై ఉంటున్నాం. ప్రోటోకాల్‌ ప్రకారం ఒక్కరినే పంపాలని మాకు చెబుతారు. పైస్థాయి ఆదేశాలను మేము అమలు చేయకూడదా? అలాంటప్పుడు మేము ఎందుకు బందోబస్తు చేయాలి సార్‌? మమ్మల్ని తిట్టడంతో పాటు, మా ఆఫీసర్‌ని చొక్కా విప్పి కొడతానంటారా.. కరెక్టేనా సార్‌?

వాడు.. వీడు అంటున్నారు సార్‌...

ఎంత రాజకీయ నాయకుడైతే మాత్రం ప్రభుత్వ ఉద్యోగిపై నోరు పారేసుకుంటారా..? పోలీసు వ్యవస్థ అంత దిగజారిపోయిందా? సార్‌ సీఎం అయ్యాక మొదటిసారి గతంలోనూ శారదా పీఠానికి వచ్చారు. అప్పుడూ మేము ప్రోటోకాల్‌ ప్రకారం ఓ వ్యక్తిని లోపలకు పంపలేదు. అప్పుడు ఓ ఎంపీ (పేరు వద్దులేండి) వచ్చి ఎవడ్రా లోపలకు పంపలేదు అన్నారు. ఇది కరెక్టేనా? అప్పుడే చాలా బాధ అనిపించింది. కష్టపడి శిక్షణ తీసుకుని రోడ్లపై ఉద్యోగాలు చేస్తే ఎవడ్రా.. వాడు.. వీడు అంటున్నారు. ఆ రోజు పోలీసు అధికారి తిరిగి ఎంపీ గారిని తిడితే పరిస్థితి ఏంటి? ప్రోటోకాల్‌లో ఓ ఎంపీదో, ఓ ఎమ్మెల్యేదో పేరు రాస్తారు. ఆయన వెంట మరో 5, 10 మంది వస్తే మేమేం చేయాలి? మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం విధులు నిర్వహించడం మా బాధ్యత. ఎండలో, వానలో కష్టపడి పని చేస్తుంటే... దుస్తులు ఊడదీసి కొడతారా? యూనిఫాంలో ఉన్న ఓ ఆఫీసర్‌ని చేయి పట్టుకుని తోసేస్తారా.. ఇది ఎంతవరకు కరెక్ట్‌? మేము పోలీసుశాఖలో క్రమశిక్షణతో ఉండాలని ఊరుకుంటున్నాం. ఇంకెవరైనా ఊరుకుంటారా? ఒకవేళ మా అధికారి తప్పు చేసి ఉంటే కమిషనర్‌కి ఫిర్యాదు చేయొచ్చు. ఇది సీఎం గారి దృష్టికి వెళ్లిందో లేదో తెలియదు. మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది. మీరు ఓ సారి పరిశీలించి చర్యలు తీసుకోండి. లేదు, అదే కరెక్ట్‌ అయితే వదిలేయండి. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి’.

ఇదీ చదవండి:

మంత్రి అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలి: పోలీసు అధికారుల సంఘం

ABOUT THE AUTHOR

...view details