APFSL Opening Programme: ఎంత పెద్ద హీరో అయినా.. స్టోరీలో కంటెంట్ ఉంటేనే ప్రజలు ఆ సినిమాను ఆదరిస్తారని.. చిన్న సినిమాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏపీ ఫైబర్‌నెట్ తీసుకొచ్చిన "ఫస్ట్‌డే ఫస్ట్‌షో" మంచి అవకాశమని.. ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇందులో భాగంగా ఆయన "ఫస్ట్‌డే ఫస్ట్‌షో" లో నిరీక్షణ అనే మూవీని ఫైబర్‌నెట్‌లో విడుదల చేశారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారి సినిమాను విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఎంత పెద్ద హీరో అయినా.. స్టోరీలో కంటెంట్ ఉంటేనే హిట్ అవుతుంది: ఈ సందర్భంగా విశాఖలో ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా నిరీక్షణ మూవీని ఆయన విడుదల చేశారు. చిన్న సినిమాలు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ఫైబర్ నెట్ మంచి అవకాశమని అన్నారు. ఏపీ ఫైబర్ నెట్ గ్రామీణ ప్రాంతం వరకు విస్తరించిందని మంత్రి తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా సినిమాలు చూసే అవకాశం ఉంటుందని అన్నారు. నిర్మాతలు అంగీకరించి ఇచ్చిన సినిమానే ఫైబర్‌నెట్‌లో ప్రసారం చేస్తామన్న మంత్రి.. సినిమా థియేటర్‌కు రాలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో నిర్మాత సి.కళ్యాణ్, నిరీక్షణ మూవీ డైరెక్టర్, చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. దీనిలో భాగంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ పైరసీని అరికట్టాలని కేంద్రాన్ని ఎన్ని సార్లు కోరినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. ఫైబర్ నెట్ ద్వారా సినిమా విడుదల చేసే అవకాశం ఏపీ ప్రభుత్వం కల్పించడం శుభపరిణామని హర్షం వ్యక్తం చేశారు. బాహుబలి వంటి సినిమాలు కూడా మొదట్లో ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు అని కళ్యాణ్ తెలిపారు. థియేటర్లలో తినుబండారాలు ఎక్కువ రేటుకు అమ్మడం వలనే ప్రజలు సినిమా థియేటర్లకి దూరమౌతున్నారని స్పష్టం చేశారు. పెద్ద సినిమాలు కూడా ఫైబర్ నెట్లో విడుదలయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని ఆశాభావం వ్యక్తం చేశారు.
చిన్న సినిమాలకు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలకి, కొత్త దర్శకులకు,నిర్మాతలకు, నూతన నటీనటులకు గానీ ఇలా వీరందరికి ఉపయోగపడుతోందనే ఉద్దేశ్యంతో ఏపీఎస్ఎఫ్ఎల్ అనే దానిని తీసుకొచ్చాం. దీనికి ప్రేక్షకుల నుంచి అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆదరణ ఉంటుందని ఆశిస్తున్నాం.-ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్
నేను నిర్మాతని.. నేను ఇష్టపడితేనే సినిమా ఇస్తా.. ఇష్టం లేకపోతే ప్రభుత్వం మా మెడలు వంచి సినిమా ఇవ్వాలని చెప్పటం లేదు. దీని వల్ల చిన్న సినిమాలకు మాత్రం కచ్చితంగా ఉపయోగపడుతుంది.-సి.కళ్యాణ్ నిర్మాత