అధికారులకు బెదిరింపులు.. విశాఖలో ముగ్గురి అరెస్టు
ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు.. విశాఖ పోలీసులకు చిక్కారు. ఈ ముఠాను.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.
అధికారులను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. 4 సెల్ ఫోన్లు, లక్షన్నర నగదు స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులను బెదిరిస్తూ.. వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని ఈ ముఠా అవినీతి అధికారుల సమాచారం సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... శ్రద్ధా ఆసుపత్రి కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ సంస్ధ వైద్యుడు రవీంద్ర వర్మను సంప్రదించి... తాను హెల్త్ సెక్రెటరీ పీఏగా నిందితుడు వెంకట నారాయణకు చెందిన ముఠా పరిచయం చేసుకుంది. కేసు నుంచి వైద్యుడు రవీంద్రను తప్పించేందుకు 10 లక్షలు డిమాండ్ చేసింది. రవీంద్రకు వీరిపై అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించారు. పధకం ప్రకారం నిందితులను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. వీరు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల కేంద్రంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు వెంకట నారాయణపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని నగర శాంతి భద్రతల డీసీపి రవీంద్రనాధ్ బాబు తెలిపారు. ఈ ముఠా వద్ద నుంచి నాలుగు సెల్ ఫోన్లు, లక్షా 50వేలు నగదు స్వాధీనం చేసున్నారు. బృందంలో ఓ మహిళ ఉన్నట్టు గుర్తించారు.