AP Udyoga Porata Committee: రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత అల్లాడుతున్నారు.. జగన్ ప్రభత్వం జాబ్ క్యాలెండర్ పేరులో యువతను నిలువునా మోసం చేసింది.. మెగా డీఎస్సీ విడుదల చేయాలని, పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని, జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని ఏపీ ఉద్యోగ పోరాట సమితి విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రకారం మొట్ట మొదటిగా ప్రతి జనవరి నెల ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి నేటికి సరిగ్గా 4 సంవత్సరాలు గడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు.. మొదటిలో గ్రూప్-2 పోస్టులు ఐదు వేలు ఖాళీగా ఉంటే 181 పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించి వైసీపీ ప్రభుత్వం చేతులు దులుపుకున్నారని అన్నారు. "పీహెచ్డీ, ఎంఫీఎల్" చేసినా వేలాది నిరుద్యోగులు ఆచార్యుల పోస్టుల భర్తీకి ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభత్వం రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేశామని చెబుతోంది కానీ.. అందులో నాలుగు లక్షలు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందే ఉన్నారు. నూతనంగా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని.. ప్రభుత్వాన్ని నిలదీశారు. జాబ్ క్యాలెండర్‌పై విద్యార్థులు, యువకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో లక్షల మంది మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ప్రతిక్షణం నిరీక్షిస్తున్నారని అన్నారు.