AP High Court hearing on Hayagriva Farms Developers: హయగ్రీవ ఫార్మ్స్ డెవలపర్స్ సంస్థ విశాఖపట్నం జిల్లా ఎండాడ గ్రామ పరిధిలో చేపడుతున్న నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) కీలక ఆదేశాలను జారీ చేసింది. రెండు వారాల్లో విశాఖ జీవీఎంసీ కమిషనర్‌కు వివరణ ఇవ్వాలని హయగ్రీవను ఆదేశిస్తూ.. జీవీఎంసీ కమిషనర్ గతంలో జారీ చేసిన నోటీసును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక మీదట హయగ్రీవ చేపట్టే నిర్మాణ పనులు జీవీఎంసీ కమిషనర్ జారీ చేయబోయే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని ధర్మాసనం తేల్చి చెప్పింది.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా ఎండాడ గ్రామ పరిధిలో హయగ్రీవ ఫార్మ్స్ డెవలపర్స్ సంస్థ చేపడుతున్న నిర్మాణ పనులను నిలిపివేయాలని.. జీవీఎంసీ కమిషనర్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హయగ్రీవ ఫార్మ్స్ డెవలపర్స్ సంస్థ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ..రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథాయ్ విచారణ జరిపారు. విచారణలో భాగంగా రెండు వారాల్లో జీవీఎంసీ కమిషనర్‌కు వివరణ ఇవ్వాలని హయగ్రీవను ఆదేశించారు.
అనంతరం వివరణ అందుకున్న వెంటనే దాన్ని పరిగణనలోకి తీసుకొని.. మూడు వారాల్లో తుది ఉత్తర్వులను జారీ చేయాల్సిందిగా జీవీఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. ఆ ప్రక్రియ ముగిసేంతవరకు.. పనులను నిలిపేయాలంటూ కమిషనర్ జారీ చేసిన నోటీసును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మీదట హయగ్రీవ చేపట్టే నిర్మాణ పనులు జీవీఎంసీ కమిషనర్ జారీ చేయబోయే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని తేల్చి చెప్పారు. అంతేకాకుండా తదుపరి పర్యావసానాలను హయగ్రీవ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించారు.