AP High Court fire on GVMC Commissioner: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్ రాజాబాబు తీరును హైకోర్టు ఆక్షేపించింది. విశాఖపట్నం జిల్లా ఎండాడ గ్రామంలో హయగ్రీవ ఫార్మ్స్, డెవలపర్స్‌కు కేటాయించిన 12.51 ఎకరాలను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ.. దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు వేయకుండా, కోర్టుతో దాగుడుమూతలు ఆడుతున్నారా? అని ఘాటుగా ప్రశ్నించింది. ఈ విషయంలో ఏదో జరుగుతోందని ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. విచారణను మార్చి 1వ తేదీకి వాయిదా వేస్తూ.. ఆ రోజు జీవీఎంసీ కమిషనర్‌ను తప్పకుండా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్. జయ సూర్యతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
విశాఖపట్నం జిల్లా ఎండాడ గ్రామంలో హయగ్రీవ ఫార్మ్స్, డెవలపర్స్‌కు సంబంధించి సర్వే నెంబరు 92/3లో కేటాయించిన 12.51 ఎకరాలను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ.. జనసేన కార్పొరేటర్ పీఎల్పీఎన్ మూర్తి యాదవ్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే, విశాఖ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు. అయితే, విచారణకు జీవీఎంసీ తరఫున న్యాయవాది లక్ష్మీనారాయణ రెడ్డి కోర్టుకు హాజరై పిటీషనర్ల వద్ద నుంచి దస్త్రాలను తీసుకొని, వాటిని పరిశీలించి కౌంటర్ వేస్తామన్నారు. అందుకు రెండు వారాల సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు.