ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు విశాఖకు సీఎం.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ముఖ్యమంత్రి జగన్​ నేటి నుంచి రెండు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. నగరంలో పలు కీలక అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్​ రాజధానిగా ప్రకటించిన అనంతరం తొలిసారిగా జగన్​ విశాఖకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నేడు విశాఖకు సీఎం.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నేడు విశాఖకు సీఎం.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన

By

Published : Dec 28, 2019, 4:59 AM IST

విశాఖలో సీఎం పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం
సాగరతీరం విశాఖలో నేటి నుంచి ముఖ్యమంత్రి జగన్​ పర్యటించనున్నారు. ఇక్కడ ఏటా నిర్వహించే విశాఖ ఉత్సవ్​ను ప్రారంభించేందుకు వస్తోన్న సీఎం.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం విశాఖకు చేరుకున్న తర్వాత సీఎం.. నేరుగా కైలాసగిరికి చేరుకుంటారు. అక్కడ వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న వివిధ పనులకు శంకుస్థాపనలు చేస్తారు.

ప్రారంభించేది వీటినే..

దాదాపు రూ.37 కోట్లతో కైలాసగిరి ప్లానిటోరియం, సిరిపురం జంక్షన్​లో రూ.80 కోట్లతో మల్టీ లెవల్​ కార్​ పార్కింగ్​, వాణిజ్య సముదాయం, రూ.88 కోట్లతో నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం రీసెర్చ్ సంస్థ, రూ.40 కోట్లతో బీచ్ రోడ్​లో చేపట్టనున్న సమీకృత మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ నిర్మాణం, భూగర్భ పార్కింగ్ వంటి పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు.

వెయ్యి కోట్ల పనులకు శంకుస్థాపన

నగర పాలక సంస్థకు చెందిన వెయ్యి కోట్ల రూపాయల పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. తీర ప్రాంత పరిరక్షణ, పచ్చదనాన్ని పెంపొందించడం, మెరుగైన రహదారులు, తాగునీటి సరఫరా మెరుగుపరిచే దిశగా చేపట్టే పనులు ఇందులో ఉన్నాయి. ముడసర్లోవ జలాశయం పునరుద్ధరణ దిశగా దాదాపు రూ.9.50 కోట్లతో చేపట్టే పనులతో పాటు కాపులుప్పాడ డంపింగ్​ యార్డులో ప్రయోగాత్మక ప్రాజెక్టును సీఎం ప్రారంభించనున్నారు. నగరానికి మరింత హరిత శోభ తీసుకువచ్చే దిశగా జీవీఎంసీ రూపొందించిన ప్రణాళికలోని పనులను సైతం సీఎం ప్రారంభిస్తారు.

భారీ భద్రత

అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పూర్తి చేసిన అనంతరం ముఖ్యమంత్రి విశాఖ ఉత్సవ్​లో పాల్గోనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి వరకూ సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు మానవ హారం ఏర్పాటు చేస్తుండడం ఈ పర్యటనలో ప్రత్యేకం కానుంది.

ఇదీ చూడండి:

రాష్ట్రపతి దృష్టికి అమరావతి అంశం: ఎంపీ సుజనాచౌదరి

ABOUT THE AUTHOR

...view details