CM Jagan is silent on the privatization of Visakha steel plant: ఎన్నికల ముందు కేంద్రంతో పోరాడి ఏదైనా సాధిస్తామని డాంబికాలు... అధికారంలోకి వచ్చాక దిల్లీ పెద్దలకు మెడలు వంచి దండాలు పెట్టడం.. ఇదీ మన సీఎం సారు పరిస్థితి. ప్రత్యేకహోదా, విభజన హామీలు, పోలవరం నిధుల నుంచి ప్రారంభమైన ఈ తీరు.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోనూ కొనసాగుతోంది. నిధులు, ముడిసరుకు కోసం స్టీల్ ప్లాంట్ ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (ఈఓఐ) జారీ చేయగా.. తెలంగాణ ప్రభుత్వం బిడ్‌లో పాల్గొనాలని నిర్ణయించింది. మన ప్రభుత్వం నుంచి మాత్రం కనీస స్పందన లేదు. వైసీపీ ప్రభుత్వ తీరుతో ఎంతో మంది ప్రాణాలొడ్డి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ.. మనది కాకుండా పోయే పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది.
వైసీపీని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతా..: 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతా. ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ సాధిస్తా. ఎన్నికలకు ముందు ఇలా ఎన్నో బీరాలు పలికారు సీఎం జగన్. తీరా అధికారంలోకి వచ్చాక కేంద్రం దగ్గర ఆయనే మెడలు వంచారు. వంచుతూనే వస్తున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తైనా.. ఇంతవరకూ ప్రత్యేక హోదా ఊసే లేదు. విభజన సమస్యలు, హామీల పరిష్కారం సంగతైతే.. జగన్ సారు మర్చేపోయారు. వేలమంది పోరాటాలు, 32 మంది బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుపైనా.. అంతే చేతగానితనాన్ని ప్రదర్శిస్తున్నారు ముఖ్యమంత్రి. ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్రం తేల్చి చెప్పినా.. తనకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు మూలధనం, ముడిసరకు లేక ఇబ్బంది పడుతున్న విశాఖ ఉక్కు కర్మాగారం.. నిధులు లేదా ముడిసరకు సమకూర్చి దానికి సరిపడా ఉక్కు ఉత్పత్తుల్ని పొందేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించింది. ఈ మేరకు మార్చి 27న ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ చేసింది.
టీఎస్‌కున్న తాపత్రయం - ఏపీకీ లేదు: మూలధన పెట్టుబడుల సమీకరణకు విశాఖ ఉక్కు ఈఓఐ జారీ చేసిన తర్వాత ఉక్కు అధికారుల సంఘం.. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి, ఆ శాఖ కార్యదర్శికి లేఖలు రాసింది. రాష్ట్రంలోని పేదల ఇళ్ల నిర్మాణానికి సుమారు 10 లక్షల టన్నుల ఉక్కు అవసరమవుతుందని, దాని విలువ 6,500 కోట్ల నుంచి 7 వేల కోట్ల వరకు ఉంటుందని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొంది. అంతేకాకుండా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచే ఉక్కును కొనేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేసింది. ఈఓఐలో పాల్గొనాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కూడా విజ్ఞప్తి చేయగా.. వెంటనే స్పందించిన కేటీఆర్ ఈఓఐ ఒక కుట్ర అంటూ మొదట కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించి, ఆర్థిక సాయం చేసి ప్రభుత్వ రంగంలో ఉంచాలని, లేదా సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈఓఐలో పాల్గొనాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలోని స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న కేంద్రం ప్రయత్నాలను అడ్డుకునేందుకే సీఎం కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. వారి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చెప్పలేం. కానీ, విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న తాపత్రయమైనా ఏపీ ప్రభుత్వానికి లేకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఎన్నికల ప్రచారంలో గొప్పలు-ఇప్పుడు మౌనదీక్షలు:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికారంలోకి వస్తే ఒడిశా రాష్ట్రం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి విశాఖ ఉక్కుకు సొంత గనుల కోసం కృషి చేస్తామని.. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఉక్కు అధికారుల సంఘం ప్రతినిధులకు జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తండ్రి వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే.. విశాఖ ఉక్కు దివాలా తీయకుండా కాపాడారని, ఆయన హయాంలోనే స్టీల్‌ప్లాంట్ విస్తరణకు వెళ్లిందని ఎన్నికల ప్రచారంలోనూ గొప్పలు చెప్పారు. తాను కూడా విశాఖ ఉక్కుకు అండగా ఉంటానన్నారు. జీవీఎంసీ ఎన్నికల సమయంలో ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జీవీఎంసీ కార్యాలయం నుంచి స్టీల్‌ప్లాంట్ గేట్ వరకు పాదయాత్ర చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 120 మంది ఎంపీలతో సంతకాలు చేయించి ప్రధాని మోదీకి పంపినట్లుగా ఒక లేఖను.. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు వైసీపీ నేతలు బయటపెట్టారు.