Science College Achievers Day Celebrations: ఆంధ్ర విశ్వ విద్యాలయంలో సైన్స్ కోర్సులను అభ్యసించే ప్రతీ విద్యార్థికి మెరుగైన ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా నిరంతరం పని చేస్తున్నామని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సైన్స్ కళాశాల ఎచీవర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ గతేడాది కంటే అధికంగా ప్లేస్మెంట్ సాధించడం జరిగిందన్నారు. ఉద్యోగ సాధన, ఉద్యోగ కల్పన చేసే స్థాయికి ప్రతీ విద్యార్థి ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి ఆకాంక్షిస్తున్నారని, దీనిని సాకారం చేసే దిశగా ఏయూ పని చేస్తున్న విధానం వివరించారు. సకాలంలో తరగతులు, పరీక్షలు నిర్వహించి నేడు 761 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను ఈ వేదికపై ఇవ్వడం ఆనందాన్ని ఇస్తోందన్నారు. మరొక 100 మందికి పైగా విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ ఇంకా రావాల్సి ఉందని, మరికొన్ని సంస్థలు నియామక ప్రక్రియను సైతం కొనసాగిస్తున్నాయన్నారు.
నేడు విద్యార్థి దశ నుంచి ఉద్యోగిగా నూతన బాధ్యతలను చేపట్టడం జరుగుతోందన్నారు. వాస్తవిక సమాజంలో అడుగిడే మీరంతా నిరంతర అధ్యయనం చేయడం, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం లక్ష్యంగా పని చేయాలని సూచించారు. క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా మిమ్మల్ని తీర్చిదిద్ది వర్సిటీకి అందించిన తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయం మాది అనే భావనతో ప్రతీ విద్యార్థి ఉండాలని సూచించారు. భవిష్యత్తులో మీ జ్ఞానం, మేధస్సును విశ్వవిద్యాలయం అభ్యున్నతికి వినియోగించాలని సూచించారు. పూర్వవిద్యార్థుల సంఘంలో సభ్యులుగా చేరి వర్సిటీతో అనుబంధం కొనసాగించాలని అన్నారు. ఉన్నత విద్య మండలి చైర్మన్ ఆచార్య కె. హేమచంద్రారెడ్డి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఏయూ రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు మార్గదర్శిగా నిలుస్తోందన్నారు.