ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు చొరవ చూపారు. విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం కొల్లాపూర్ పంచాయతీ పరిధిలోని శివారు భూములకు సంబంధించి ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు చెందిన గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదాన్ని పరిష్కరించే చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తరఫున పాడేరు ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి, ఒరిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా సబ్ కలెక్టర్ అర్చనదాసులు వివాదాస్పద ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
ఇరు రాష్ట్రాల సరిహద్దులను నిర్ణయించేందుకు సమావేశం అయ్యి సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయిస్తామని ఇరు రాష్ట్రాల అధికారులు ప్రజలకు వివరించారు. శాంతియుతంగా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కారం చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.