విశాఖపట్నంలోని చింతపల్లి మండలం, తాజంగి గ్రామం లోచలికి చెందిన శారదమ్మకు తోటి గిరిజన మహిళల్లానే అక్షరజ్ఞానం లేదు. బాల్యంలోనే పెళ్లి. ‘ఉద్యోగం చేసే భర్త దొరికాడు.. ఇక తన జీవితానికే లోటూ ఉండదు’ అనుకుందామె లోకం తెలియని పదమూడేళ్ల వయసులో. అనుకున్నట్టే అయితే అది జీవితం ఎందుకు అవుతుంది? గిరిజన సహకార సంస్థలో సేల్స్‌మెన్‌గా చేసే భర్త రాజులు అనారోగ్యంతో కన్నుమూశాడు. అప్పటికి శారదమ్మ ఇద్దరు పిల్లల తల్లి. కొడుకు చిన్నంనాయుడుకి నాలుగేళ్లు. కూతురికి నెలరోజులు. మరే ఆసరా లేని ఆమె పిల్లల ఆకలి తీర్చడం కోసం కాఫీ తోటల్లో పనికి వెళ్లేది. రోజుకు రూ.5 కూలి. అవి చాలేవి కాదు. వెదురు నరికే పనులకీ వెళ్లింది. ఇలా ఎన్ని రోజులు చేసినా కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టం అనిపించింది. ఆమె దృష్టి వ్యవసాయంపై పడింది. పుట్టింటి వాళ్లిచ్చిన రెండెకరాల్లో పసుపు, చిరుధాన్యాలు వేసి సేంద్రియ సాగు మొదలుపెట్టింది. ఆదాయంలో కొంత పొదుపు చేసి పిల్లలిద్దరినీ చదివించింది. కష్టాలు ముప్పేట దాడి చేస్తున్నా ధైర్యం కోల్పోలేదు. బిడ్డల భవిష్యత్ కోసం పగలురాత్రీ శ్రమించింది. ‘గిరిజన వికాస్’ అనే సంస్థ స్థాపించిన ‘ఆంధ్రా కశ్మీర్ ట్రైబల్ ఫార్మర్స్’ సంస్థలో చేరింది. రైతుల నమ్మకాన్ని కూడగట్టుకుని, అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఈ సంస్థకి ఉపాధ్యక్షురాలయ్యింది శారదమ్మ.
‘గిరిజన వికాస్’ స్వచ్ఛంద సంస్థ 2017లో తాజంగి కేంద్రంగా ‘ఆంధ్రా కశ్మీర్ ట్రైబల్ ఫార్మర్స్ అండ్ మార్కెటింగ్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్’ను స్థాపించింది. సేంద్రియ పద్ధతుల్లో పండించే పసుపు, కాఫీ, మిరియాలు వంటి ఉత్పత్తులకు మార్కెటింగ్‌తోపాటు, శుద్ధి చేసిన వాటిని బెంగళూరు, దిల్లీ, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంది. ఇందులో 1,037 మంది రైతులు సభ్యులు. 550 మంది వాటాదారులు. ఈ సంస్థ పనితీరును గుర్తించి ఉద్యానశాఖ, ఐటీడీఏలు పోత్సహించాయి. దళారుల ప్రమేయం లేకుండా రైతుల నుంచీ నేరుగా కొంటారు. ఆ ఉత్పత్తుల క్లీనింగ్, గ్రేడింగ్, పాలిషింగ్ వంటివీ చేసి జాతీయ స్థాయిలో విక్రయిస్తుందీ సంస్థ. ఈ ఏడాది ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘం 50 టన్నుల పసుపు, 17 టన్నుల కాఫీని రైతుల నుంచీ కొనుగోలు చేసి రూ.70లక్షల రూపాయల లావాదేవీలను నిర్వహించింది.
పొదుపుదారు నుంచి నాయకురాలిగా..
పొదుపు శారదమ్మ జీవితాన్ని మలుపు తిప్పింది. ‘శ్రీమహిళా మాతోట మాక్స్ సొసైటీ’ మహిళా బ్యాంకులో సాధారణ సభ్యురాలిగా చేరింది. నెలకు రూ.5 పొదుపు చేసేది. అలా మొదలైంది ఆమె ప్రయాణం. సభ్యులను నడిపించడంలో, వ్యవస్థాగత వ్యవహారాల నిర్వహణ సామర్థ్యాలు, నాయకత్వ పటిమతో ఇప్పుడు బ్యాంకు ఛైౖర్‌పర్సన్‌గా ఎదిగింది. 2017లో మొదలైన ఈ పొదుపు సంఘంలో 3,770 మంది మహిళలు సభ్యులు. ఈ బ్యాంకులో ఏటా రూ. 3 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. సభ్యులకు వ్యవసాయం, చదువులు, పెళ్లిళ్లు, వైద్యం వంటి అత్యవసర ఖర్చులకు తక్కువ వడ్డీతో రుణం అందిస్తుందీ బ్యాంకు. ‘ప్రస్తుతం రూ.50 వేల వరకూ రుణం ఇస్తున్నాం. దీన్ని లక్ష వరకూ పెంచాలన్నది ఆలోచన’ అంటోంది శారదమ్మ.