ఆంధ్రా కశ్మీర్ లంబసింగిలో చలి స్థానికులను వణికిస్తుంది. వారం రోజులుగా వాతావణంలో కొంత మార్పు వచ్చింది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి. సోమవారం ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. చింతపల్లిలో సోమవారం 8.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన వాతావరణ విభాగం శాస్త్రవేత్త సౌజన్య తెలిపారు. సహజంగానే చింతపల్లి కంటే లంబసింగిలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు తక్కువగా నమోదు అవుతోంది.
ప్రస్తుతం లంబసింగిలో 6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడం కారణంగా చలి తీవ్రత పెరిగిపోయింది. అలాగే మంచు కూడా దట్టంగా కురుస్తోంది. తాజా వాతావరణ పరిస్థితులు స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోంది. ఇదిలావుంటే ఈ ప్రాంతాల సందర్శనకు అనుకూలమైన సమయం కావడంతో పర్యటకులు భారీగా తరలివస్తున్నారు. లంబసింగికి మూడు కిలోమీటర్లు దూరంలో నున్న చెరువుల వెనంలోనూ వాతావరణం మైమరిపిస్తుంది. ఇక్కడ మంచు అందాలు ఆకట్టుకుంటున్నాయి.