అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కుటుంబ సమేతంగా.. విశాఖ ఏజెన్సీ పాడేరు మండలంలోని వంజంగి కొండల అందాలను వీక్షించారు. వేకువజామునే అక్కడికి చేరుకుని.. సూర్యకిరణాల్లో తేలియాడే వెండి మబ్బుల ప్రకృతి రమణీయ దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. స్థానిక గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. వారి ఉదయపు ఆహారమైన అంబలి తాగారు. కొండ ఎక్కేటప్పుడు పడిన కష్టం దిగేటప్పుడు మర్చిపోయామన్నారు. ఏజెన్సీ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా.. ఈ ప్రాంతం అభివృద్ధి గురించి పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇతర ఎమ్మెల్యేలను కలుపుకుని ఈ విషయంలో ముందుకు సాగుతామని.. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్షి భర్త, రాష్ట్ర వైద్య సలహా మండలి సభ్యులు నర్సింగ్ రావు తెలిపారు.
నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా.. వంజంగి పర్వత ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు ఎంపీ మాధవి.. రెండు రోజుల కిందటే వాటిని తిలకించారు. ఉషోదయపు వేళలో ఇక్కడి మంచు అందాలు, మేఘాలను చీల్చుకుంటూ ప్రసరిస్తున్న సూర్య కిరణాలు.. చూపరులను కట్టిపడేస్తాయి. ఇటువంటి అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయం నుంచే పర్యాటకులు బారులు తీరుతున్నారు.