ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సగంపైగా స్థలం పోతే.. పరిశోధనలు నిర్వహించడం ఎలా? - పరిశోధన స్థానానికి ప్రత్యామ్నాయ స్థలం

విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని 50 ఎకరాల స్థలాన్ని వైద్య కళాశాలకు కేటాయించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో చెరకు, జాతీయ స్థాయిలో బెల్లంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 76 ఎకరాల్లో పరిశోధనలు కొనసాగుతుండగా.. వైద్య కళాశాలకు 50 ఎకరాలు పోగా 26 ఎకరాలే పరిశోధన కేంద్రానికి మిగులుతుంది. ఇందులోనే పూర్తి స్థాయిలో పరిశోధనలు నిర్వహించడం ఎలా అని శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు.

anaka palli agriculture research land
పరిశోధనలు నిర్వహించడం ఎలా?

By

Published : Nov 8, 2020, 6:50 PM IST

ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఏర్పాటై 107 ఏళ్లు పూర్తికావస్తోంది. అప్పట్లో 103 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. రహదారులు, పరిపాలన, పరిశోధన భవనాలకు 27 ఎకరాలు పోగా మిగిలిన భూమిలో పరిశోధనలు చేస్తున్నారు. ఇతర పరిశోధన కేంద్రాల్లో రూపొందించే నూతన వంగడాలను ఇక్కడకు తీసుకువచ్చి పరిశోధనలు చేస్తారు. ఈ ప్రాంతానికి అనుకూలంగా ఉన్నాయని తేల్చిన తర్వాతే రైతులకు సిఫార్సు చేస్తారు. ఈ కేంద్రం పరిధిలో ఆముదాలవలస, రాగోలు, విజయనగరం, ఎలమంచిలి పరిశోధన స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత అనకాపల్లి స్థానానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. గత ప్రభుత్వం అనకాపల్లి పరిశోధన స్థానానికి భారీగా నిధులు కేటాయించింది. వీటితో ఇప్పటికే ద్రవ జీవన ఎరువుల తయారీ విభాగాన్ని ఏర్పాటు చేశారు.

బెల్లం పరిశోధనలకు ప్రత్యేకంగా యునిట్‌ను మంజూరు చేశారు. ఈ పనులు ముగింపు దశకు చేరాయి. పరిశోధనలకు నూతన ప్రయోగశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులోనే వ్యవసాయ, ఇంజినీరింగ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులకు వేర్వేరుగా వసతిగృహాలను నిర్మించారు. రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా భవనం నిర్మిస్తున్నారు. తెదేపా ప్రభుత్వం ఇక్కడ వ్యవసాయ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలని భావించింది. ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటైతే పరిశోధనలకు స్థలం సరిపోదని నాటి విశ్వవిద్యాలయం అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కృషి విజ్జాన కేంద్రాన్ని స్థల సమస్యతో బుచ్చెయ్యపేట మండలం కొండంపూడిలో ఏర్పాటు చేశారు. ఉద్యాన పరిశోధన కేంద్రం, ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాలలను గత ప్రభుత్వం మంజూరు చేయగా, ఈ రెండింటికి 45 ఎకరాల స్థలం అవసరమని నాటి పాలకమండలి సభ్యులు తెలిపారు. వీటికి పరిశోధన కేంద్రంలో స్థలం ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. పరిశోధన కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటుపై పునరాలోచించాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు.

పరిశోధన స్థానానికి ప్రత్యామ్నాయ స్థలం

విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి మరోచోట అదనంగా 50 ఎకరాలు కేటాయించనున్నట్లు సమాచారం. గొలగాం, కోడూరు, వల్లూరులోని ప్రభుత్వ స్థలాల్లో ఏదో ఒకటి కేటాయించాలని భావిస్తున్నారు. వీటిలో ఏదో ఒక స్థలం ఎంపిక చేసుకోవల్సిందిగా శాస్త్రవేత్తలకు ఇప్పటికే సూచించారు. వడు స్థలాలను ఇటీవల పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇవేమీ పరిశోధనలకు అనుకూలంగా లేవని తేల్చివేశారు. వడు ప్రాంతాలు కొండను ఆనుకుని ఉన్నాయని, ఇక్కడ పరిశోధనలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.

ఇదీ చదవండి:

విశాఖ ఏజెన్సీలో పోలీసుల ముమ్మర తనిఖీలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details