Old woman Concern in Atchutapuram: ఆక్రమణలో ఉన్న భూమిని విడిపించి, దానికి వచ్చిన పరిహారం ఇప్పించాలని ఓ వృద్ధురాలు 18 ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయానికి వస్తోంది. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు శివారు రావిపాలెంనకు చెందిన రావి రమణమ్మ(61) అత్తామామలకు 9.48 ఎకరాల సాగు భూమి ఉంది. కొంత భాగాన్ని ప్రభుత్వం 2004లో సెజ్ కోసం సేకరించి, పరిహారం ఇచ్చింది. భూమిలో రమణమ్మ భర్త వాటా రాకపోవడంతో.. పరిహారమూ దక్కలేదు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ రమణమ్మ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది.
తన వాటానూ బంధువులే తీసుకున్నారని... భూమిలోకి వెళ్తే వారు దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి విపక్ష నేతగా పాదయాత్ర చేసినప్పుడు కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చానని పేర్కొంది. అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తాననడంతో.. సీఎం అయ్యాక తాడేపల్లికి వెళ్లి విన్నవించని తెలిపింది. ఏ ఒక్క అధికారైనా స్పందించకపోతాడా అని రోజు 10 గంటలకే తహసీల్దారు కార్యాలయానికి వస్తున్నట్లు పేర్కొంది. భర్తకు వచ్చే వృద్ధాప్య పింఛనులోంచి రాకపోకలకే రోజు రూ.50 ఖర్చవుతున్నాయని ఆవేదన వేదన వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దారు రాంబాయి మాట్లాడుతూ.. రమణమ్మ భర్త పేరిట భూమి లేనందున పరిహారం ఇవ్వలేదని తెలిపారు. భూమి భర్త పేరున చేయించుకునేందుకు ముందు కోర్టును ఆశ్రయించాలని రమణమ్మకు సూచించినట్లు పేర్కొన్నారు.