Old women dead: విశాఖ జిల్లా ఆనందపురం మండలం పొడుగు పాలెం గ్రామంలో తన స్థలంలో అంగన్వాడి కేంద్రం నిర్మించొద్దని అడ్డుకున్న వృద్ధురాలు శిణగం ఎల్లమ్మ(80)ను జేసీబీతో తొక్కించి చంపారని స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఆధారంగా మృతురాలి మనవరాలు, సీపీఎం నాయకులు మాట్లాడుతూ ఎల్లమ్మను కావాలనే చంపించారని.. దీని వెనక వైకాపా నాయకుల హస్తముందని ఎల్లమ్మ మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించిన సర్పంచ్ చందక లక్ష్మీతో పాటు కాంట్రాక్టర్ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. మృతి చెంది 24 గంటలు గడిచినా ఇప్పటివరకు చర్యలు తీసుకుపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం అనీ.. మృతురాలి కుటుంబానికి రూ.20 లక్షలు అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లోకనాథం, నాయకులు ఆర్ఎస్ఎన్ మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ జరిగింది: విశాఖ జిల్లా ఆనందపురం మండలం పొడుగుపాలెంలో విషాదం నెలకొంది. అక్రమ నిర్మాణాల తొలగింపును అడ్డుకున్న శిణగం ఎల్లమ్మ(80) అనే వృద్ధురాలిని జేసీబీతో బలంగా ఢీకొట్టారు. దీంతో తీవ్రగాయాలు పాలైన ఆ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది.