Allegations on Former VC PVGD Prasada Reddy: ఆది నుంచి వివాదాస్పద నిర్ణయాలతో వివాదాల్లో నిలచిన ఆంధ్ర వర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి పదవి కాలం ఈ నెల 24న ముగిసింది. ప్రసాదరెడ్డి తీసుకున్న అనేక నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైనా, ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదనే విమర్శలు ఉన్నాయి. గత నాలుగేళ్లలో యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అలుమ్ని అసోసియేషన్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఇది నేడు విచారణకు రానుంది. ప్రసాద రెడ్డి నిర్ణయాలతో సీనియర్ ప్రొఫెసర్లు తమ అవకాశాలు కోల్పోయారని ఆరోపిస్తూ.. వీటికి సంబంధించిన వివరాలతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్‌కు సంఘం ప్రతినిధులు పంపారు. ప్రసాదరెడ్డిపై లోకాయుక్త లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించేలా ప్రభుతాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ వీసీ ప్రసాదరెడ్డితీసుకున్న నిర్ణయాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో ఆయన చేపట్టిన నియామకాలు వివాదాస్పదమయ్యాయి. ప్రైవేటు కళాశాలలో పనిచేసిన జేమ్స్ స్టీఫెన్‌కు.. సరైన అర్హత లేకున్నా అంబేడ్కర్ అధ్యయన కేంద్రం ఛైర్ ప్రొఫెసర్‌గా తాత్కాలిక నియామకం పేరుతో వర్సిటీలో స్థానం కల్పించారని ఆప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కొద్దిరోజులకే ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ హబ్ డీన్‌గానూ.. ఆయనకు బాధ్యతలు అప్పగించారు. వర్సిటీలో కనీసం రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి కాకుండానే సీనియర్ ఆచార్యులను పక్కనపెట్టి సెప్టెంబరులో.. రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక రిజిస్ట్రార్‌గా పనిచేసిన ప్రొఫెసర్ వి.కృష్ణమోహన్ 2020 ఆగస్టు 31న విశ్వవిద్యాలయ సేవల నుంచి విరమణ పొందారు. కృష్ణమోహన్ రిజిస్ట్రార్ పదవిలో కొనసాగించాలని.. వీసీ ప్రసాదరెడ్డి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిలకు లేఖలు రాశాడు. విద్యా సంబంధిత కార్యకలాపాల్లో ఆయన అనుభవం వర్సిటీకి అవసరమని చెప్పడం వల్ల అతనికి మూడుసార్లు పదవీకాలం పొడిగించారు. మూడోసారి పొడిగించిన పదవీ కాలం కూడా సెప్టెంబరులో ముగియగా అక్టోబరులో తిరిగి ఓఎస్‌డీగా నియమించారు.
పంతం నెగ్గించుకున్న ఎస్‌కేయూ వీసీ - విద్యార్థులను ఈడ్చుకుంటూ వెళ్లిన పోలీసులు