విశాఖపట్నంలో జనసేన పార్టీ తలపెట్టిన లాంగ్ మార్చ్‌కి ఏర్పాట్లను ఆ పార్టీ సిద్దం చేస్తోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం విశాఖ చేరుకుని మధ్యాహ్నం 3గంటలకు మద్దిలపాలెం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు దాదాపు 2.8 కిలోమీటర్ల మేర లాంగ్‌మార్చ్ నిర్వహిస్తారు. 13 జిల్లాల నుంచి జన సైనికులు ఈ లాంగ్ మార్చ్‌లో పాల్గొనున్నారు. వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసినవారికి, నియోజకవర్గ ఇంఛార్జిలకు కార్యక్రమ బాధ్యతలను అప్పగించారు.
లాంగ్‌మార్చ్‌కు తెదేపా.. దూరంగా భాజపా..
లాంగ్‌మార్చ్‌కు తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రులైన అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడులు హాజరుకానున్నారు. తమకు నాల్గొవ తేదీన ఉన్న నేపథ్యంలో హాజరు కాలేమని భాజపా తేల్చి చెప్పింది. ఇదిలావుంటే.. భాజపా మద్దతు కోరినందున తాము పాల్గొనలేమని వామపక్ష నేతలు తెలిపారు. అయితే తమ సంఘీభావం ఉంటుందని స్పష్టం చేశారు.