అన్నదాతలకు అండగా నిలిచే మార్కెట్ కమిటీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంట ఉత్పత్తులపై పన్ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో... మార్కెట్ యార్డులు కోట్ల ఆదాయన్ని కోల్పోవాల్సి వచ్చింది. నాలుగు నెలలుగా పైసా ఆదాయం లేక... ఉన్న నిధుల నుంచి ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా మార్కెట్ కమిటీల ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. నిధుల కొరత ప్రభావం రైతు సంబంధిత సేవలపైన పడుతోంది.
1966లో ప్రారంభం...
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని.. 1966లో మార్కెట్ యార్డులకు శ్రీకారం చుట్టారు. గోదాములు నిర్మించి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. నిల్వ చేసిన పంటలపై వడ్డీ రాయితీ రుణాలను సైతం అందజేసేవారు. ఉత్పత్తులపై పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని తిరిగి రైతు సంక్షేమానికే ఖర్చు చేసేవారు. యార్డుల్లో పని చేసే ఉద్యోగుల జీతాలు, రైతుబంధు పథకం, ఉచిత పశువైద్య శిబిరాలు, పొలాలకు వెళ్లేందుకు రహదారులు వంటి కార్యక్రమాలు చేపట్టేవారు. ఈ విధమైన సేవలు అందించే వ్యవసాయ మార్కెట్ కమిటీలు నేడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మార్కెట్లకు రావాల్సిన పన్నులను రద్దు కావటంతో పూర్తిగా కుదేలు అయ్యాయి.