విశాఖలోని గాజువాకలో ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన మల్లారెడ్డి వెంకటేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను నేర విభాగం డీసీపీ సురేష్ బాబు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 19 అర్ధరాత్రి అఫీషియల్ కాలనీలోని ఓ ఇంటిలో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. కేవలం కిటికీకి ఉన్న మెష్‌ను చించేసి... ఇంటిలోని బీరువా హుక్కు తగిలించి ఉన్న బ్యాగులోని బంగారాన్ని నిందితుడు దొంగిలించాడని గుర్తించారు. ఇనుప రాడ్‌పై వేలిముద్రలు ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు.
మల్లారెడ్డి వెంకటేష్‌పై గతంలోను అనేక కేసులు నమోదయ్యాయని డీసీపీ సురేష్ బాబు తెలిపారు. గతేడాది వరకు నిందితుడు జైలులోనే ఉన్నాడని చెప్పారు. నిందితుడి వద్ద నుంచి 18 తులాలకుపైగా బంగారు ఆభరణాలు, 18 గ్రాముల వెండి, చేతి గడియారం, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వివరించారు.