వీఎంఆర్‌డీఏ ప్లానింగ్ ఆఫీసర్ ఆస్తులపై అనిశా దాడులు.. విలువ ఎంతంటే? - వీఎంఆర్‌డీఏ
15:08 October 26
బహిరంగ మార్కెట్లో వీటి విలువ 20 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా
ACB RAIDS ON VMRDA OFFICER : విశాఖ వీఎంఆర్‌డీఏ ప్లానింగ్ అధికారి వర్ధనపు శోభన్ బాబుకు భారీగా ఆస్తులున్నట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో.. శోభన్ బాబు ఇళ్లు, కుటుంబీకుల నివాసాల్లో అనిశా అధికారులు నిన్న తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహించారు. విజయనగరం డీఎస్పీ రామచంద్రారావు ఆధ్వర్యంలో ఏకాకాలంలో 3 బృందాలు.. విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో సోదాలు చేశాయి. గతంలో శోభన్ బాబు పనిచేసిన ప్రతిచోటా ఆయనకు స్థిరాస్తి ఉన్నట్లు గుర్తించారు.
పురపాలక శాఖ పట్టణ ప్రణాళిక విభాగ ఉద్యోగి అయిన శోభన్ బాబు .. ప్రస్తుతం వీఎంఆర్డీఏలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ప్రస్తుతం విశాఖలోని లాసన్స్ బే కాలనీలోని సొంత ప్లాటులో ఉంటున్నారు. శోభన్ బాబు స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచి గ్రామం. 2 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు.. అనిశా అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 20 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా. శోభన్ బాబును అ.ని.శా. కోర్టులో హాజరుపరచనున్నామని అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి: