విశాఖకు చెందిన కనకమహాలక్ష్మి, బసవయ్య దంపతులు.. ప్లాస్టిక్ సామగ్రిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కడు పేదరికంలో ఉన్న వారికి మరో కష్టం తోడైంది. కనకమహాలక్ష్మికి కిడ్నీలు చెడిపోయాయి. ఈ క్రమంలో విశాఖలోని విమ్స్‌లో డయాలసిస్ చేయించుకునేది. కరోనా లాక్ డౌన్... ఆమె పాలిట శాపంగా మారింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ... విమ్స్‌ను ప్రత్యేక ఆస్పత్రిగా గుర్తించగా... వైద్యులు ఆమెను కేజీహెచ్‌లో వైద్యం చేయించుకోవాలని సూచించారు. కానీ లాక్ డౌన్ కారణంగా రవాణా సౌకర్యం స్తంభించిపోయింది. ఈ కారణంగా.. ఆమె కేజీహెచ్‌కు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆమె నివసించే అరిలోవ నుంచి వీల్ చైర్లో పది కిలో మీటర్ల మేర భర్త బసవయ్య సహాయంతో కేజీహెచ్‌కు వెళ్లి వైద్యం చేయించుకుంటోంది.
'రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికి నాలుగు సార్లు వీల్ చైర్‌పైనే కేజీహెచ్‌కు వెళ్లాం. వైద్యం అందకపోతే బ్రతుకలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి'