ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తల్లడిల్లిన తల్లి హృదయం.. బిడ్డ కోసం కన్నీరు

ఓ వాహనదారుడి నిర్లక్ష్యం.. ఓ మూగజీవానికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది. వేగంగా వాహనాన్ని నడుపుతూ అడ్డువచ్చిన ఓ చిన్నకుక్కపిల్ల మీద నుంచి వాహనాన్ని పోనివ్వడంతో అది బాధను భరించలేక.. అడుగుతీసి అడుగువేయలేక గిలగిల్లాడింది. తన కడుపున పుట్టిన పిల్ల తన కళ్లముందే భరించలేని బాధతో అరుస్తోంటే.. తల్లికుక్క బాధతో విలవిల్లాడింది. కుక్కపిల్ల శరీరంపై నాకుతూ.. దాన్ని కాళ్లతో కదుపుతూ.. బాధతో ఏడుస్తూ అటూ ఇటూ తిరగడం బిడ్డకు భరోసా కల్పించే ప్రయత్నాన్ని చూసిన స్థానికులను కంటతడి పెట్టించింది.

dog story in visakapatnam
తల్లడిల్లిన తల్లి హృదయం.. బిడ్డ కోసం కన్నీరు

By

Published : Jan 30, 2021, 5:05 PM IST

తల్లడిల్లిన తల్లి హృదయం.. తన బిడ్డకు భరోసా ఇస్తూ

విశాఖలోని గొల్లలపాలెం జంక్షన్‌ సమీపంలో న్యూ పితాని దిబ్బ వీధిలో శుక్రవారం సాయంత్రం ఓ కుక్క పిల్ల రోడ్డుపై ఆడుకుంటుండగా వేగంగా వచ్చిన వాహనం దాన్ని ఢీకొట్టింది. అనంతరం దాని శరీరంపై నుంచే వాహనం వెళ్లిపోవడంతో ఆ చిన్న కుక్కపిల్ల బాధను భరించలేకపోయింది. లేచి నుంచోడానికి కూడా అవస్థలు పడసాగింది. రోడ్డుపై గిలాగిలాకొట్టుకుంది. అక్కడే ఉన్న తల్లి కుక్క దాని దగ్గరికి వచ్చి కుక్కపిల్ల శరీరాన్ని నాకుతూ.. దాన్ని ఓదార్చే ప్రయత్నం చేసింది.

మిగిలిన ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయి..

కొద్దిరోజుల కిందటే ఎక్కడి నుంచో నాలుగు చిన్నకుక్కపిల్లలతో వచ్చి ఆ వీధి పరిసర ప్రాంతాల్లో తిరుగుతోంది ఆ తల్లి కుక్క. ఆ నాలుగు కుక్కపిల్లల్లో మూడింటిని ఎవరో ఎత్తుకుపోవడంతో.. గత మూడు రోజులుగా అది వాటి కోసం పరిసరప్రాంతాల్లో గాలిస్తోంది. తన కుక్కపిల్లల్ని ఆటోలో తీసుకెళ్లడం ఆ తల్లికుక్క చూసిందో ఏమో.. ఆటో ఆగితే రెండుకాళ్లూ ఆటోలో పెట్టి ఆటో లోపలిభాగాన్ని చూస్తున్న వైనం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. మిగిలిన ఒక్కగానొక్క కుక్కపిల్ల ప్రమాదంలో చనిపోవడంతో ఆ తల్లికుక్క దిక్కుతోచక ఆకాశంవైపు ముఖం ఎత్తి ఏడుస్తుండడం స్థానికులను కంటతడిపెట్టించింది.

ఆగ్రహంతో అరుస్తూ..

ఒక స్కూటీ తన కుక్కపిల్లను ఢీకొట్టడాన్ని గమనించిన తల్లి.. ఆ మార్గంలో ప్రయాణించిన చిన్న చక్రాల వాహనదారులపై ఆగ్రహంతో మొరిగింది. ఆయా వాహనాలను కొద్దిదూరం వెంబడించింది. ఆ తల్లికుక్క, కుక్కపిల్లల బాధను చూసి స్థానికులు కన్నీరు పెట్టారు.

ఎవరూ పట్టించుకోక ప్రాణాలు విడిచి..

ఆ ప్రాంతానికి సమీపంలోనే పశువుల ఆసుపత్రి ఉన్నప్పటికీ అది మూసివేసి ఉండడం.. అందులో సిబ్బంది కానరాకపోవడంతో వైద్య సాయం కూడా అందలేదు. సుమారు అరగంటపాటు ఆ చిన్న కుక్కపిల్ల గిలగిలా కొట్టుకుని చివరికి ప్రాణాలు విడిచింది.

ఇదీ చదవండి:

'ఆచార్య సభ నిర్వహిస్తా...హిందూ పరిరక్షణ కోసం పరిశ్రమిస్తా'

ABOUT THE AUTHOR

...view details