System of volunteers working for YCP: జగన్ ప్రభుత్వం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నాటిన వాలంటీర్ వ్యవస్థ.. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా రాష్ట్రం మొత్తం వేళ్లూనుకుంది. వైసీపీ కోసం పెంచి పోషిస్తున్న ఈ సమాంతర వ్యవస్థ..ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతోంది. ప్రజాస్వామ్యానికే పెను సవాల్‌గా మారింది. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన.. స్వేచ్ఛగా జీవించే హక్కుకి, భావ ప్రకటన స్వేచ్ఛకు పెను విఘాతంగా మారింది.
పింఛన్లు వంటి ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు సక్రమంగా అందేలా చూసేందుకే వాలంటీర్లను నియమించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే..వాలంటీర్ల నియామకం వెనుకున్న అసలు ఉద్దేశం వేరే..! వారు సేవ చేస్తోంది ప్రజలకు కాదు..అధికార పార్టీకే. వారు చేస్తోంది పూర్తిగా రాజకీయ కార్యకలాపాలే! ప్రజలపైనా, ప్రతిపక్షాలపైనా నిఘా పెట్టడం, వారి బలాల్ని, బలహీనతల్ని కూపీలాగి అధికార పార్టీకి చేరవేయడమే వారి ప్రధాన విధి.
ప్రభుత్వ వైఫల్యాలు, పథకాల అమలులో లోపాలపై పౌరులు ఎవరైనా ఒక మాట మాట్లాడాలంటే చుట్టూ ఒకసారి పరికించి చూసి, వాలంటీరు లేరని నిర్ధారించుకున్నాకే పెదవి విప్పుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ప్రజల్ని అంతగా భయపెడుతోంది. సీఎం చెప్పిన ఈ మాటలు బయటి వాళ్లెవరైనా వింటే..వైసీపీ ప్రభుత్వం 2.61 లక్షల మంది మానవతామూర్తుల్ని తయారు చేసిందేమోనని భ్రమపడతారు. కానీ మంత్రి అంబటి రాంబాబు మాటల వింటే అసలు విషయం అర్థమవుతుంది.
విన్నారుగా..వాలంటీర్లు ఎవరో, ఎవరి కోసం పనిచేస్తున్నారో..! పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రతి వాలంటీరు తమకు కేటాయించిన కుటుంబాల్లో అర్హత ఉన్నవారిని గుర్తించి, ధ్రువీకరణ పత్రాలు సేకరించి ఓటర్లుగా నమోదు చేయించారు. ఎన్నికలప్పుడూ ప్రచారం చేయాలని వైసీపీ నుంచి వారికి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. పథకాలన్నీ జగనే ఇస్తున్నారని.. ప్రతి లబ్ధిదారునికి పదేపదే చెబుతున్నారు. మళ్లీ జగన్ సీఎం అయితేనే పథకాలన్నీ కొనసాగుతాయని ప్రచారం చేస్తున్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి రాకుంటే..వచ్చే ప్రభుత్వం ఇళ్ల స్థలాల్ని రద్దు చేస్తుందని లబ్ధిదారుల్ని బెదిరిస్తున్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అధిక శాతం మంది వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు.. వాలంటీర్లతో ప్రత్యేక వ్యవస్థను నడుపుతున్నారు. క్రమం తప్పకుండా వారితో టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ.. గ్రామాల వారీగా పార్టీల బలాబలాల వివరాలను సేకరిస్తున్నారు. ప్రైవేటుగా ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీకి సంబంధించిన మండల స్థాయి అధికారులు(ఎమ్‌ఎల్‌వో) క్రమం తప్పకుండా వాలంటీర్లతో సమావేశాలు నిర్వహిస్తూ..ప్రజలు ఎవరైనా వైసీపీపై అసంతృప్తితో ఉన్నారా? కారణాలేంటి? వారు ఏ పార్టీకి చెందినవారు? వంటి వివరాలను సేకరిస్తున్నారు.
అసంతృప్తిగా ఉన్న వారితో ప్రత్యేకంగా మాట్లాడి, వ్యతిరేకతను పోగొట్టాలని పైనుంచి ఆదేశిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొనే ప్రభుత్వ సమావేశాలు, వైసీపీ సభలకు ప్రజల్ని తరలించే బాధ్యత వాలంటీర్లదే. హాజరవకపోతే పథకాలు రద్దవుతాయని ప్రజలను బెదిరిస్తున్నారు. వాళ్లే దగ్గరుండి వాహనాల్లోకి ఎక్కించి తీసుకెళుతున్నారు. అక్కడ హాజరును నమోదు చేస్తున్నారు.
నేతన్ననేస్తం, పింఛన్ల పంపిణీలో అర్హత ఉన్నవారికి కూడా.. కొన్నిచోట్ల వైసీపీ నేతల ఒత్తిడితో లబ్ధి చేకూరడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మద్దతిచ్చిన అభ్యర్థికి ఓట్లేయలేదని మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఓ గ్రామంలో కొందరు లబ్ధిదారులకు కాపు, ఈబీసీ నేస్తం పథకాలు నిలిపేశారు.
ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధుల్లోనూ వాలంటీర్లు పాల్గొనరాదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలిచ్చినా కొన్నిచోట్ల ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను వారే చేపట్టారు. ఎన్నికలు ఏవైనా వాలంటీర్లు వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం నుంచి, ఓటర్లకు డబ్బు పంపిణీ వరకు అన్నీ తామై చక్కబెడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాష్ట్రంలో పలుచోట్ల వైసీపీ నేతలు సమకూర్చిన వాహనాల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు శాసనసభా స్థానం ఉప ఎన్నికలోనూ వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారు. కొన్నిచోట్ల వైసీపీ నేతల ఆదేశాల మేరకు కులాల వారీగా లబ్ధిదారుల జాబితాను వాలంటీర్లు సేకరించారు. ఏ సామాజికవర్గానికి ఏఏ పథకాలు అందాయి. ఎక్కువగా లబ్ధి పొందిన వర్గాలేవి? వంటి వివరాల్ని నమోదు చేశారు.
ప్రభుత్వం ఇటీవల వాలంటీర్ల ద్వారా ఎంప్లాయిమెంట్ సర్వే చేయించింది. వారికి కేటాయించిన కుటుంబాల్లో..అక్షరాస్యులెందరు? డిగ్రీ ఎక్కడ పూర్తి చేశారు? వృత్తిరీత్యా ఎక్కడ ఉంటున్నారు? ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్నారా? వారు ఏ రాజకీయ పార్టీ అంటే ఆసక్తి చూపిస్తున్నారనే వివరాలను సేకరించారు. అసలు ఎంప్లాయిమెంట్ సర్వేలో రాజకీయ ఆసక్తులను తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటని విపక్షాలు నిలదీస్తున్నాయి.
వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల్ని వాలంటీర్లే నిర్ణయించడంపై ఈ ఏడాది ఏప్రిల్ 6న హైకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా మండిపడింది. వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టుకి వివరాలు సమర్పించేందుకు శ్రీకాకుళం నుంచి వస్తున్న ఒక కుటుంబానికి చెందినవారిని స్థానిక వాలంటీర్ నిర్బంధించడాన్ని హైకోర్టు ప్రస్తావించింది.