ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరకు లోయలో హరిత హననం - అరకులో హైదరాబాద్ అధ్యాపకుల అధ్యయనం వార్తలు

అరకులోయ.. ప్రకృతి గీసిన అందమైన చిత్రం. పర్యాటకుల స్వర్గధామం. ఆహ్లాదపరిచే పర్యావరణం. పచ్చని అందాలతో అలరారే జీవవైవిధ్యం. అలాంటి అరకులోయలో 6 చ.కి.మీ మేర అటవీ విస్తీర్ణం తగ్గినట్లు హైదరాబాద్‌ జేఎన్టీయూ అధ్యాపకుల అధ్యయనంలో వెల్లడైంది. అడవి తరిగిపోవడం వల్ల పశువులు, శాఖాహార వన్యప్రాణులకు గ్రాసం కొరత ఏర్పడుతుందన్నారు.

araku
araku

By

Published : Apr 17, 2022, 5:51 AM IST

తూర్పు కనుమల్లోని అనంత వృక్షసంపదతో ఒనగూరిన ఈ విశిష్టతలన్నీ ఏటేటా తరిగిపోతున్నాయి. 13.2 చదరపు కిలోమీటర్ల మేర సహజ వృక్ష సంపద, 6 చ.కి.మీ మేర అటవీ విస్తీర్ణం తగ్గినట్లు హైదరాబాద్‌ జేఎన్టీయూ అధ్యాపకుల అధ్యయనంలో వెల్లడైంది. 2009-2020 మధ్యకాలంలో చేసిన పరిశీలన, శాటిలైట్‌ చిత్రాలు, 2014 రాష్ట్ర అటవీ శాఖ వివరాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. విశాఖపట్నం జిల్లా సుంకరిమెట్ట, అరకు ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో విస్తరించిన అరకులోయ.. వైవిధ్యమైన వృక్షజాతులకు నెలవు. జింకలు, చిరుతలు వంటి వన్యప్రాణులకు ఆవాసయోగ్యమైన ప్రాంతమిది. జేఎన్టీయూ-హెచ్‌లోని పర్యావరణ విభాగానికి చెందిన టి.విజయలక్ష్మి, కె.ఆర్‌.ఎల్‌.శరణ్య, బాలానగర్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ ఫారెస్ట్‌ బయోడైవర్సిటీకి చెందిన సి.సుధాకర్‌రెడ్డి ఈ ప్రాంతంలో వచ్చిన మార్పులపై కొన్నాళ్లు అధ్యయనం చేశారు.

అరకులోయలో అడవి తరిగిపోవడం వల్ల పశువులు, శాఖాహార వన్యప్రాణులకు గ్రాసం కొరత ఏర్పడుతోంది. పర్యావరణ వ్యవస్థతో పాటు జీవవైవిధ్యంపై ప్రభావం చూపుతోంది. అరకు, గుంటసీమ, సుంకరిమెట్ట సెక్షన్లలో పచ్చదనాన్ని తగ్గిస్తున్న కొత్త హాట్‌స్పాట్లను పరిశోధకులు గుర్తించారు. గుంటసీమ సెక్షన్‌లో ఎక్కువ విస్తీర్ణంలో పచ్చదనం కనుమరుగైంది. 2013 నుంచి 2020 వరకు సంవత్సరాల వారీగా అటవీ విస్తీర్ణంలో తగ్గుదలను ఉపగ్రహ చిత్రాల ద్వారా సేకరించారు. సాగుభూములుగా మారిన అడవులు, అగ్నిప్రమాదాల్లో కాలిపోయిన ప్రదేశాలను గుర్తించారు. ప్రతిపాదిత బాక్సైట్‌ మైనింగ్‌ చేపడితే, అరకులో ప్రకృతి సహజత్వానికి తీవ్ర విఘాతమని, వన్యప్రాణుల ఆవాసాలు దెబ్బతింటాయని నివేదికలో ప్రస్తావించారు. అడవి సంరక్షణ, పునరుద్ధరణ చర్యలు చేపట్టడం ద్వారానే ఈ ప్రాంత భౌగోళిక, జీవ వైవిధ్యాన్ని కాపాడవచ్చని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:TRAIN TRAIL RUN: అరకు మార్గంలో.. అద్దాల రైలు ట్రయల్‌ రన్‌

ABOUT THE AUTHOR

...view details