లాటరీ రూపేణా భారీ మొత్తంలో నగదు వస్తుందన్న అసత్య సమాచారాన్ని నమ్మిన ఓ వ్యక్తి ఏకంగా 70 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. నిలువునా మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన ఆయన పోలీసులను ఆశ్రయించారు. విశాఖ నగరానికి చెందిన బి.రామృష్ణకు 2015లో వరల్డ్ లాటరీ ఆర్గనైజేషన్ నుంచి ఓ మెయిల్ వచ్చింది. అందులో ఆయన 250,000,000 గ్రేట్ బ్రిటన్ ఫౌండ్లు( రూ.2500కోట్లు) గెలుచుకున్నట్లు ఉంది. విషయ నిర్ధరణకు ఆయన వచ్చిన మెయిల్‌కు బదులిచ్చారు. ఫాస్టర్ న్యూమాన్ అనే వ్యక్తి +448726148738 నుంచి రామకృష్ణకు ఫోన్ చేశాడు. తాను ఎచ్.హెస్.బి.సి బ్యాంకు అధికారనని.. యూకే నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. ప్రైజ్ మనీ పొందాలంటే యూకేలోని తమ బ్యాంకులో ఖాతా తెరవాలని.. దానికి కొంత సొమ్ము కట్టాలని చెప్పాడు. ఖాతా తెరిచాక ఎటీఎమ్ కార్డు వస్తుందని.. దాని ద్వారా లాటరీ ద్వారా వచ్చిన నగదు తీసుకోవచ్చని నమ్మించాడు. రామకృష్ణ రూ. 34,500 నగదును తొలుత జమచేశారు. తర్వాత యూకే నుంచి ఏటీఎమ్ కార్డు పంపించారు.
ఒక్క మెయిల్‌తో... రూ.70 లక్షలు దోచేశారు! - lottery
అత్యాశకు పోయిన అధికారి... ఏకంగా 70 లక్షల రూపాయలను నేరగాళ్లకు సమర్పించుకున్నారు. లాటరీ పేరుతో సైబర్ కేటుగాళ్లు వేసిన వలలో చిక్కుకుని చివరకు పోలీసులను ఆశ్రయించారు.
ఏటీఎమ్ కార్డు పనిచేయాలంటే ప్రపంచబ్యాంక్‌కు, యాంటీ టెర్రరిస్టు నిధుల సమీకరణకు, బీమాకంటూ పలుమార్లు నగదు డిపాజిట్ చేయించుకున్నారు. అయినా ఏటీఎమ్ కార్డు పనిచేయనందున ఫాస్టర్ న్యూమాన్‌ను రామకృష్ణ మళ్లీ సంప్రదించారు. ప్రైజ్‌మనీని తమ ప్రతినిధి కెల్విన్ ఫిలిప్స్ అప్పగిస్తారంటూ అతడ్ని రామకృష్ణ ఇంటికి పంపించాడు. అతడు వెంట తెచ్చిన బాక్సులోని కొంత బ్లాక్ కోటెడ్ కరెన్సీని ఓ ద్రవంలో ముంచి యూకే ఫౌండ్లుగా మార్చి చూపించి రామకృష్ణను పూర్తిగా నమ్మించాడు. తెచ్చిన ద్రవం అయిపోయిందని యూకే వెళ్లాక కొరియర్లో పంపిస్తామని చెప్పటంతో రామకృష్ణ దఫదఫాలుగా వారికి రూ.70 లక్షలను ముట్టజెప్పారు. అనంతరం వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు.. విశాఖ సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ గోపీనాథ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.