ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెయ్యి పేజీల పుస్తకమైనా క్షణాల్లో అనువాదం చేయడంలో..తెలుగోడి ఘనత

ప్రధాని ఆకాంక్షను ఓ తెలుగు యువకుడు నేరవేర్చాడు. ఏఐసీటీఈ ఏఐ ట్రాన్స్‌లేషన్‌ టూల్‌ ఆవిష్కరణలో అతను కీలకపాత్ర పోషించాడు. ఎంత పెద్ద పుస్తకాన్నయినా కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో క్షణాల్లో అనువదించే ఈ టూల్‌ను ప్రధాని మోదీ ఇటీవల ఆవిష్కరించారు.  ఇది 90 శాతం కచ్చితత్వంతో ఎలాంటి పుస్తకాన్నయినా 12 భాషల్లోకి అనువదించగలదు.

a man from visakha created aicte ai transalation tool
ఏఐసీటీఈ ఏఐ ట్రాన్స్‌లేషన్‌ టూల్‌

By

Published : Aug 1, 2021, 8:17 AM IST

మాతృభాష కాకుండా ఇతర భాషల్లోని పుస్తకాలు, గ్రంథాలను చదవడం, వాటిని అర్థం చేసుకోవడం క్లిష్టమైన వ్యవహారమే. అందుకోసం ఆ భాష నేర్చుకోవడం లేదంటే వాటి అనువాదాలు వచ్చే వరకూ వేచి ఉండక తప్పదు. ప్రస్తుతం కొన్ని యాప్‌లు సమాచారాన్ని ఇతర భాషల్లోకి అనువాదం చేస్తున్నా వాటి కచ్చితత్వంపై విశ్వసనీయత తక్కువే. ఈ పరిస్థితి బాధాకరమని, క్షణాల్లో అనువాదం చేసే సాంకేతికతను అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర విద్యాశాఖ అధికారులకు సూచించారు.

దిల్లీలోని ఏఐసీటీఈలో ముఖ్య సమన్వయ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న విశాఖకు చెందిన బుద్ధా చంద్రశేఖర్‌ ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగా ఈ అనువాద సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. ఇంజినీరింగ్‌ పట్టభద్రుడైన ఆయన అమెరికాలో ఎంబీఏ చేశారు.

కంప్యూటర్‌ సైన్స్‌, కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఐవోటీ తదితర అంశాలపై విశేష అవగాహన ఉన్న ఆయన 6 నెలలుగా అనువాద పరిజ్ఞాన రూపకల్పనపై దృష్టి సారించారు. ముగ్గురు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులతో కలిసి ‘ఏఐసీటీఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ ట్రాన్స్‌లేషన్‌ టూల్‌’ను రూపొందించారు. ఎంత పెద్ద పుస్తకాన్నయినా కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో క్షణాల్లో అనువదించే ఈ టూల్‌ను ప్రధాని మోదీ ఇటీవల ఆవిష్కరించారు. ఇది 90 శాతం కచ్చితత్వంతో ఎలాంటి పుస్తకాన్నయినా 12 భాషల్లోకి అనువదించగలదు.

సుమారు వెయ్యి పేజీల పుస్తకాన్ని ఒక భాషలోకి అనువదించడానికి సుమారు 20 సెకన్ల సమయం పడుతుంది. ఆ సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఆంగ్లం నుంచి హిందీ, ఒడియా, తెలుగు, తమిళం, మరాఠీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ, పంజాబీ భాషల్లోకి అనువాదం చేసుకోవచ్చు. ఆ 12 భాషల్లో ఏ భాషలో ఉన్న పుస్తకాన్నయినా మిగిలినవాటిలోకి కూడా క్షణాల్లో అనువదించవచ్చు.

ఇవీ సాఫ్ట్‌వేర్‌ ప్రత్యేకతలు

  • పుస్తకం/ నివేదికలోని పేజీలు ఏ రంగు, డిజైన్‌లో ఉన్నాయో అనువాద పుస్తకమూ అచ్చం అలాగే ఉంటుంది.
  • గ్రాఫ్‌లు, పట్టికలు, ఫార్ములాలు, ప్రత్యేక గుర్తింపు చిహ్నాలు, గుర్తులు, వ్యాక్యాల ఫాంట్లు యథాతథంగా ఉంటాయి. భాష మాత్రమే మారుతుంది.
  • ఫొటోలపైన సమాచారం ఉంటే మాత్రం అనువాదం కాదు.
  • అంధులు ఆ పుస్తకంలోని సమాచారాన్ని నచ్చిన భాషలో వినే సౌకర్యం ఉండటం మరో విశేషం.

కోట్ల మందికి ఉపయుక్తం


దేశంలోని కోట్ల మంది గ్రామీణులు మాతృభాషలో ప్రతిభావంతులైనప్పటికీ ఉన్నత విద్యకు వచ్చేసరికి ఆంగ్లంపై అవగాహన లేక రాణించలేకపోతున్నారు. అలాంటి వారికి మేలు చేకూర్చాలన్న ప్రధాని మోదీ ఆకాంక్ష మేరకు అధునాతన పరిజ్ఞానాలతో సాఫ్ట్‌వేర్‌ను కేంద్ర విద్యాశాఖ తరఫున రూపొందించాం. తదుపరి ఆదేశాలు వచ్చాక ఆ పరిజ్ఞానాల్ని అందరికీ అందుబాటులోకి తెస్తాం. ఇంజినీరింగ్‌ను మాతృభాషలో కూడా చదువుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చిన తరుణంలో మా అనువాద సాంకేతికత విద్యార్థులకు చాలా ఉపయోగపడనుంది.

- బుద్ధా చంద్రశేఖర్‌, ముఖ్య సమన్వయ అధికారి, ఏఐసీటీఈ, దిల్లీ

ఇదీ చూడండి.Kondapalli: కొండపల్లిలో అక్రమ మైనింగ్​.. తెదేపా నేతల అడ్డంకులు.. అరెస్టులు

ABOUT THE AUTHOR

...view details