మగధీర.. ఈ చిత్రం పేరువింటే చాలు గుర్రంపై వేగంగా స్వారీ చేసే ఆ సినిమాలోని కథానాయకుడు గుర్తొస్తాడు. కానీ విశాఖ మన్యం తూర్పు కనుమ ప్రాంతాల్లోనూ ఓ ఉపాధ్యాయ మగధీరుడు ఉన్నాడు. అతనే గిమ్మెలి పంచాయతీ సుర్లపాలెం ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే వెంకటరమణ. కష్టపడి గుర్రపు స్వారీ నేర్చుకొని.. తాను విధులు నిర్వర్తించే పాఠశాలకు వెళ్తూ.. పాఠాలు బోధిస్తున్నాడు.
గుర్రంపై సవారీ.. చదువు చెప్పేందుకేనోయీ! - A government teacher to school on horse, vishaka manyam
రవాణా సౌకర్యం ఉండి ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి చదువు చెప్పడమంటేనే అదో పెద్ద ప్రయాణంలా భావిస్తారు చాలా మంది ఉపాధ్యాయులు. పట్టణ ప్రాంతాల్లోనైతే అమ్మో ట్రాఫిక్ అంటారు. కాస్తా నడిచి వెళ్తున్నారంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్న ఓ గురువుకు ప్రజలు ఓ గుర్రం కొనిచ్చారు. టీచర్‌కు గుర్రం కొనివ్వటంమేంటి ? గుర్రానికి, పాఠాలు బోధించటానికి లింక్ ఏంటని ఆలోచిస్తున్నారా. అయితే ఈ కథనం చదవాల్సిందే.
విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ జి.మాడుగుల మండలం పరిధిలోనిదే సుర్లపాలెం ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ విధులు నిర్వర్తించాలంటే దాదాపు 5 కిలోమీటర్లు నడవాల్సిందే. ఇదే పాఠశాలలో వెంకటరమణ అనే ఉపాధ్యాయుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. చాలా కాలంపాటు గిమ్మెలి వరకు ద్విచక్రవాహనంపై వస్తూ... అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు నడిచి వచ్చేవాడు. ఉపాధ్యాయుడి కష్టాన్ని చూడలేక స్థానిక గిరిజనులు ఓ గుర్రం కొనిచ్చారు. నెమ్మదిగా గుర్రం స్వారీ నేర్చుకుంటూ పాఠశాలకు రావటం మొదలుపెట్టాడు. ఇలా తన ప్రయాణాన్ని గిమ్మెలి నుంచి సుర్లపాలెం వరకు గుర్రంపైనే చేస్తూ విధులు నిర్వర్తిస్తున్నాడు వెంకటరమణ. రోడ్లు అభివృద్ధి చేసి రవాణా సౌకర్యం కల్పించాలని, మన్యంలో ఉన్న ప్రతి పాఠశాలను అభివృద్ధి చేయాలని కోరుతున్నాడు.
ప్రతిరోజు ఇలా సాహసం చేస్తూ విధులు నిర్వర్తించేందుకు వస్తున్నప్పటికీ ఆ పాఠశాలకు శాశ్వత భవనమంటూ లేదు. చుట్టుపక్కల పల్లెల నుంచి సుమారు 55 మంది వరకు విద్యార్థులు చదువుకునేందుకు వస్తుంటారు. శాశ్వత భవనంతోపాటు కనీస మౌలిక వసతులు లేకపోవటంతో చాలా మంది విద్యార్థులు బడికి రావటం మానేస్తున్నారు. ఎంతో నిబద్ధత కలిగిన ఉపాధ్యాయుడు ఉన్న ఈ పాఠశాలను అభివృద్ధిని చేయాలని స్థానికులు కోరుతున్నారు.
అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా సరిగా పనిచేయాలని ఉపాధ్యాయులు ఉన్న ఈ రోజుల్లో గుర్రంపై వెళ్తూ ఉపాధ్యాయ విధులు నిర్వర్తిస్తున్న వెంకటరమణను గ్రామస్థులు అభినందిస్తున్నారు. విశాఖ మన్యం లాంటి ప్రాంతాల్లో విధులు అంటేనే వెనకడగు వేసే పరిస్థితుల్లో వృతిపై ఉన్న ప్రేమతో, నిబద్ధతో విధులు నిర్వర్తిస్తున్న వెంకటరమణలాంటి ఉపాధ్యాయుడు నిజంగా ఎంతోమందికి ఆదర్శనీయం.