విశాఖలో వైద్యుడిగా చలామణీ అవుతూ చాలా మంది మహిళలను ముగ్గులోకి దింపి వేధింపులకు గురి చేసిన మోసగాడి
గుట్టురట్టయింది. 17మంది యువతులు ఇతని బారిన పడినట్లు పోలీసులు గుర్తించారు.
నకిలీ ఫేస్బుక్ ఖాతాతో 17 మంది యువతులకు వల - విశాఖ జిల్లాలో నేర వార్తలు
అతడు ఓ డ్రైవర్. కానీ తాను డాక్టర్ అంటూ యువతులతో పరిచయాలు ఏర్పరచుకుని లోబరుచుకునేవాడు. తర్వాత వేధింపులపర్వానికి తెరతీసి.. వారి నుంచి బంగారు నగలు, నగదును దోచుకునేవాడు.
కంచరపాలెంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు తప్పుడు వివరాలతో ఓ ఫేసుబుక్ ఖాతా తెరిచాడు.వైద్యుడిగా పరిచయం చేసుకుని యువతులను లోబరుచుకునేవాడు. వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి వేధింపులకు గురి చేస్తుండేవాడు. ఈ విధంగా యువతలను బెదిరించి పెద్ద ఎత్తున బంగారు నగలు, భారీగా నగదు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా వారి స్నేహితుల్ని తన లైంగిక వాంఛలు తీర్చేలా చేయాలని బాధితులను ఒత్తిడి చేసేవాడు. సుమారు ఆరు నెలలుగా ఈ తతంగమంతా సాగుతున్నట్లు గుర్తించారు. మాయగాడి వలలో పడిన బాధితురాలొకరు నేరుగా నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టి కంచరపాలెంలో నాలుగురోజుల క్రితం నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.