విశాఖలో రోజుల వయసున్న ఓ పసికందు కరోనా మహమ్మారిని జయించింది. గాజువాక నడుపూరు ప్రాంతానికి చెందిన ఆకులు ప్రశాంతి (31) ఏప్రిల్ 27న స్థానిక ఆసుపత్రిలో అమ్మాయికి జన్మనిచ్చింది. పాప పుట్టిన నాటి నుంచి శ్వాసకోస సమస్యతో ఇబ్బందులు పడుతూ, తొమ్మిదో రోజుకు తీవ్ర అస్వస్థతకు గురైంది. నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు సాయి సునీల్ కిషోర్ చిన్నారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించడంతో పాజిటివ్ అని తేలింది. తర్వాత న్యూమోనియా కూడా ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే పాపను ఎన్‌ఐసీయూలో ఉంచారు. హై ప్రెజర్‌తో కూడిన మెకానికల్ వెంటిలేషన్ అందించారు. 24 గంటలు ఐసొలేటెడ్ గదిలో వెంటిలేటర్ కేర్ అందించారు. ఐవీ రెమ్‌డెసివిర్ ఐదు రోజులపాటు ఇచ్చారు. చిన్నారి ఊపిరితిత్తులు ఇన్‌ఫ్లమేషన్‌కు గురికావడంతో ఐవీ స్టెరాయిడ్లు ఐదు రోజులపాటు అందించారు. ఆరోగ్యం మెరుగుపడటంతో ఏడు రోజుల తరువాత మెకానికల్ వెంటిలేషన్ తొలగించారు. పాప వయస్సు ప్రస్తుతం 35రోజులు. సోమవారం డిశ్ఛార్జి చేసి బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించామని డాక్టర్ సాయిసునీల్‌కిషోర్ తెలిపారు.