8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..! సాధారణంగా గర్భిణులు సొంత పనులు చేసుకునేందుకు కూడా ఇబ్బంది పడుతుంటారు. వాంతులు, వికారం అంటూ అస్వస్థతకు గురవుతుంటారు. కానీ... విశాఖ మన్యంలో... 8 నెలల గర్భిణీ చేసే సాహసం ఔరా అనిపిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే... ఆమె పేరు అరుణ. స్వస్థలం పాడేరు మండలం బరిసింగి. పాడేరు సమీపంలోని కొండపై 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరో నెలలో ప్రసవించనున్న ఆరుణ... నిత్యం ఇంటి, పొలం పనులు చేసుకుంటోంది. బరిసింగి నుంచి పాడేరు వరకూ... ఘాట్ రోడ్డుపై 15 కిలోల బరువున్న బంతిపూల గంపలు మోసుకుంటూ వెళ్తోంది. ఏకబిగిన 5 కిలోమీటర్ల దూరం నడుస్తోంది.
అరుణ స్పందన ఏమిటో తెలుసా..?
ఇప్పటికే మీకు ముగ్గురు సంతానం. మరో నెలలో నాలుగో బిడ్డకు జన్మనిస్తావు కదా... ప్రతికూల పరిస్థితుల్లో ఎందుకిలా బరువులు మోస్తున్నావని ప్రశ్నిస్తే... తన పని తాను చేసుకుంటే సులభ ప్రసవం అవుతుందని అంటోంది అరుణ. గతంలో ప్రసవాల సమయంలోనూ... ఎలాంటి శస్త్ర చికిత్సలు జరగలేదని చెప్పింది.
ఇలాంటి పరిస్థితుల్లోనూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న అరుణను... స్థానికులు మెచ్చుకుంటున్నారు. తమ గ్రామానికి కనీసం ఆటోలు ప్రయాణించేందుకూ మార్గం లేదని... రహదారి సౌకర్యం కల్పిస్తే నడక బాధ తప్పుతుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి : ఆటోనే ఆవాసం... ఆకలితో సావాసం...