విశాఖ జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రంలోని ప్రశాంతి పాలిటెక్నికల్ కళాశాల ఆధ్వర్యంలో 500 మీటర్ల జాతీయ జెండాతో స్వాతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావడాన్ని పురస్కరించుకొని ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్సీసీ విద్యార్థులు 500 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం, ప్రభుత్వ అధికారులు కలిపి నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎన్సీసీ క్యాడెట్లు కవాతు చేస్తూ జాతీయ జెండాను పట్టుకుని పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ కల్నల్ స్నేహ లోక దాస్, కమాండింగ్ ఆఫీసర్ మహేశ్, నెహ్రూ యువ కేంద్రం సమన్వయకర్త హాజరయ్యారు. ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించడానికి ఇలా వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రశాంతి విద్యా సంస్థల ఛైర్మన్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పోలీసులు సైతం తమ వంతు సహకారం అందించారు. అచ్యుతాపురంలోని కళాశాల నుంచి సెజ్ కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది.