విశాఖ మన్యం నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల ద్రవరూప గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. విశాఖ జిల్లా హుకుంపేట మండలం నందివలస కూడలి వద్ద అనుమానాస్పదంగా ప్లాస్టిక్ కవర్లతో ఉన్న ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు గమనించారు. వారిని ప్రశ్నించే క్రమంలో ఓ వ్యక్తి పరారయ్యాడు. అనంతరం మరోవ్యక్తి నుంచి ప్లాస్టిక్ కవర్లలో 14 కిలోల ద్రవరూప గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుకుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వ్యక్తిని పట్టుకునేందుకు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. నిందుతుణ్ని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.12 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ సీఐ అనిల్ కుమార్ వెల్లడించారు. సుమారు 300 కిలోల గంజాయిని 14 కేజీల ద్రవరూప గంజాయిగా మార్చవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ద్రవరూప గంజాయి జి.మాడుగుల మండలంలో తయారు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.