ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏరులై పారుతున్న మద్యం.. యథేచ్ఛగా అక్రమ రవాణా - illegal liquor transportation in ap

రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. కర్ఫ్యూ ఆంక్షలు ఉన్నా.. ఏ మాత్రం పట్టింపు లేకుండా అక్రమార్కులు దందాను కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారిపై నిఘా పెడుతున్న పోలీసులు.. పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

illegal liquor caught at andhra pradesh
illegal liquor caught at andhra pradesh

By

Published : Jun 1, 2021, 8:31 AM IST

ఓ వైపు కరోనాతో జనం అల్లాడుతుంటే.. మరోవైపు కొందరు నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నారు. కర్ఫ్యూ ఆంక్షలు ఉన్నా... అధికారుల కళ్లుగప్పి దందాను కొనసాగిస్తున్నారు.

అనంతపురం జిల్లా డోనేకల్లు సమీపంలో సోమవారం ఉదయం కర్ణాటకకు చెందిన 54 మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు గుంతకల్లు డీఎస్పీ షర్ఫుద్దీన్‌ పేర్కొన్నారు. డోనేకల్లు గ్రామం సమీపంలో 67వ జాతీయ రహదారిలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద పోలీసు సిబ్బంది రెండు బృందాలుగా విడిపోయి వాహనాల తనిఖీలను చేపట్టారని చెప్పారు. బళ్లారి నుంచి గుంతకల్లు వైపున వెళ్తున్న రెండు కార్లను ఆపి తనిఖీలు నిర్వహించగా.. 36 మద్యం సీసాలు, 4,800 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని వాహనాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. కర్ణాటక ధరల ప్రకారం వాటి విలువ రూ.1,81,932గా ఉందని చెప్పారు.

కడప జిల్లా బద్వేల్ నుంచి అక్రమంగా తరలిపోతున్న తెలంగాణ మద్యాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా పామూరుకు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఓ కారును, లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలు జిల్లా నందవరం మండలంలోని నాగులదిన్నె, సోముల గూడూరు గ్రామాల వద్ద జరిపిన దాడుల్లో 493 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేశారు. ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి పట్టివేత.. ఒక వ్యక్తి అరెస్ట్

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్లరెడ్డిపాలెం గ్రామంలో 35 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి నిల్వ చేసిన నిందితుడు మధుసూధనరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details