నెల్లూరు జిల్లాలో 2010-19 మధ్య 64వేల ఎకరాలను ప్రభుత్వం పారిశ్రామికవాడలు, సెజ్‌లకు కేటాయించగా.. వాటిలో సుమారు రూ.57వేల కోట్ల పెట్టుబడులతో 60 వరకు భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మేనకూరు, మాంబట్టు, కృష్ణపట్న, అంకులపాటూరు, శ్రీసిటీ తదితర ప్రాంతాల్లో కర్మాగారాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు కొంతవరకు మెరుగుపడినా.. కార్యకలాపాలు, ఉత్పత్తులకు అవసరమైన నీటివసతి, లభ్యతే తగినంత లేకుండాపోయింది. ఆయా యాజమాన్యాలకు నేటికీ నీటి వనరే ప్రధాన సమస్య. 2019లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో నీటి ఎద్దడి కారణంగా కొన్ని పరిశ్రమలు తాత్కాలికంగా మూసివేయాల్సిన గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. పారిశ్రామిక అవసరాలకంటూ ప్రత్యేకంగా నీటి కేటాయింపు లేకపోవడం సమస్యను జఠిలం చేస్తోంది.
మేనకూరు పారిశ్రామికవాడలో 15 వరకు భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉండగా- అత్యధికం ప్రైవేటు వ్యక్తుల ద్వారా ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. మాంబట్టు పారిశ్రామికవాడలోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారంతో పాటు నీటి వనరులు సమకూర్చడమే లక్ష్యంగా ఏపీఐఐసీ నడుం కట్టింది. వీసీఐసీ, బీసీఐసీ కారిడార్ల పరిధిలోని పారిశ్రామికవాడలు, ఎస్‌ఈజెడ్‌లు, కృష్ణపట్నం ప్రాంతంలో ఏర్పాటు కానున్న సీఈజెడ్‌లోని పరిశ్రమలకు కండలేరు జలాశయం నుంచి పైప్‌లైన్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు రూ.625 కోట్లతో భారీ ప్రాజెక్టును రూపకల్పన చేసింది. ఈ పనుల పర్యవేక్షణకు మేనకూరు కేంద్రంగా ఏపీఐఐసీ సబ్ జోనల్ అధికారిని నియమించింది.
లీటరుకు రూ. 1.50 సెస్సు
పరిశ్రమలకు అవసరమైన నీటి వనరుల కల్పనకు ప్రభుత్వం ఏడీబీ లాంటి సంస్థల నుంచి రుణం తీసుకుంటోంది. అదే సమయంలో నీటి సరఫరా నిర్వహణ, పరిశ్రమల నుంచి సెస్ సక్రమ వసూళ్ల పర్యవేక్షణకు ఏపీఐఐసీ ద్వారా ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే లీటరు నీటికి రూ. 1.50 చొప్పున సెస్ వసూలు చేయనున్నారు.