రాయలసీమలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో పెట్టారు.
కడప జిల్లాలో కడప నగరపాలికతో పాటు 6 పురపాలికలకు పోలింగ్ జరగనుంది. పులివెందులను వైకాపా ఏకగ్రీవం చేసుకోగా.. ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు, యర్రగుంట్ల, రాయచోటికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 135 వార్డుల్లో 526 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 3 లక్షల 80 వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అత్యధికంగా ప్రొద్దుటూరులో 32 వార్డులకు, అత్యల్పంగా రాయచోటిలో 3 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 2 వేల మంది సిబ్బందితో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
చిత్తూరులో 97 సమస్యాత్మక కేంద్రాలు..
చిత్తూరు జిల్లాలో 2 నగరపాలక సంస్థలు, 4 పురపాలికలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు.. పుత్తూరు, నగరి, పలమనేరు, మదనపల్లె పురపాలికలకు పోలింగ్ జరగనుంది. తిరుపతి నగరపాలికలో 50 డివిజన్లలో 22 ఏకగ్రీవం కాగా.. 1 డివిజన్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలను నిలిపివేశారు. మిగిలిన 27 డివిజన్‌లలో 87 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చిత్తూరులో 50 డివిజన్ లలో 37 ఏకగ్రీవం కాగా 13 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 50 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మదనపల్లెలో 20వార్డుల్లో.. పలమనేరులో 8 వార్డుల్లో.. నగరిలో 22 వార్డుల్లో పోలింగ్ జరుగనుంది. పుత్తూరులో 26 వార్డుల్లో అధికారులు ఎన్నికలు పెట్టారు. 3 లక్షల 26వేల 440మంది ఓటు వేయనున్నారు. 137బూత్‌లు అత్యంత సమస్యాత్మకమైనవిగా.. 97 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.
2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు: కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప
కర్నూలు జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, ఆత్మకూరు, ఆళ్లగడ్డ నందికొట్కూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 302 వార్డుల్లో 77 ఏకగ్రీవం కాగా.. 225 వార్డుల్లో పోలింగ్ జరుగనుంది. 8 లక్షల 58 వేల 610 మంది ఓటు వేయనున్నారు. 2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు పెట్టారు. అలజడి సృష్టించేందుకు అవకాశం ఉందన్న వారిని బైండోవర్ చేశారు.