ఎండలు మండుతున్నాయి.. జాగ్రత్తగా ఉండండి!
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. సాధారణాన్ని మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ అధికారులు సూచించారు.
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఐదు జిల్లాల్లో వడగాడ్పులు.. జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ మేరకు ఆర్టీజీఎస్ ప్రజలను అప్రమత్తం చేసింది. సాధారణం కంటే ఎక్కువగా కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు తెలిపింది. ప్రకాశం జిల్లా కారంచేడులో 44, గుడ్లూరులో 42, తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరంలో 42.8, కృష్ణా జిల్లా మొవ్వలో 42.7, నెల్లూరులో 42.62, గుంటూరు జిల్లా ఈపూరులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 210 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని.. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రజలు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని కోరింది. ఈనెల 10 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అంచనా వేసింది.