YSRCP Leaders Running Silica Sand Business in AP: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీలక నేతల కనుసన్నల్లో సాగుతున్న సిలికా శాండ్ వ్యాపారం చేతులు మారింది. ఇంతకాలం చెన్నై వ్యాపారులు సాగించిన దందాను తిరుపతి జిల్లా గూడూరు పరిధిలోని ఇద్దరు వైసీపీ నేతలకు అప్పగించారు. వీరిలో ఒకరు.. కొంతకాలం కిందట ఓ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందిన నేత కాగా.. మరొకరు ఓ రాష్ట్రస్థాయి కార్పొషన్ ఛైర్‌పర్సన్ భర్త ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం వైసీపీ కీలక నేతకు భారీ మొత్తంలో ముడుపులు చెల్లించినట్లు సిలికా శాండ్ డీలర్లలో చర్చ నడుస్తోంది.
తిరుపతి జిల్లా చిల్లకూరు, కోట మండలాల్లోని సిలికా శాండ్ లీజుల్లో తవ్వకాలు, డీలర్లకు విక్రయాలను సుమారు నాలుగేళ్లుగా చెన్నైకు చెందిన మైనింగ్ వ్యాపారులు నిర్వహిస్తున్నారు. శ్రీవామన ఎంటర్‌ప్రైజెస్, వామన ఫ్యూచర్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, గామా ఎంటర్‌ప్రైజెస్, వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్ పేరిట మినరల్ డీలర్ లైసెన్సులు తీసుకుని, సిలికా తవ్వకాలు, విక్రయాలు నిర్వహించారు. తాజాగా వీరికి వైసీపీలోని అత్యంత కీలక నేతకు మధ్య స్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో గతనెల నుంచి చెన్నై వ్యాపారులకు చెక్‌పెట్టి స్థానిక నేతలను తెరపైకి తీసుకొచ్చారు. సిలికా ధర నిర్ణయించడం, డీలర్లపై పెత్తనం, ప్రభుత్వానికి చూపించే లెక్కల్లో ఆక్రమాలు.. అన్నీ వీరూ కొనసాగిస్తున్నారు.
Illegal Silica Mining: రెచ్చిపోతున్న సిలికా మైనింగ్ మాఫియా.. అక్కడ అడుగుపెట్టాలంటే వణుకు..
Illigal Sand Mining In AP: రాష్ట్రవ్యాప్తంగా నది ఇసుక తవ్వకాలు, విక్రయాలను ప్రధాన గుత్తేదారు జేపీ సంస్థ పేరిట, ఉప గుత్తేదారైన చెన్నై మైనింగ్ వ్యాపారికి చెందిన టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్ గతేడాది వరకు నిర్వహించింది. దానిని సరిగ్గా ఏడాది కిందట ఉన్నపళంగా వైదొలిగేలా చేశారు. అదే సమయంలో గూడూరు పరిధిలో సిలికా వ్యాపారం చేస్తున్న చెన్నై వ్యాపారుల కార్యకలాపాలను ఆపి వేయించారు. ఇసుక వ్యాపారాన్ని టర్న్‌కీ పేరిట వైసీపీ నేతలకు అప్పగించి, వే-బిల్లులు మాత్రం జేపీ-టర్న్‌కీ పేరిట ఇప్పటికీ ఇస్తున్నారు. సిలికా శాండ్ వ్యాపారంలో మాత్రం.. గతేడాది కొద్దిరోజులు దందాను నిలిపివేయించినా, మళ్లీ చెన్నై వ్యాపారులే కొనసాగించేలా చూశారు. గతనెల 15 వరకు వారే వ్యాపారం నిర్వహించారు. తాజా మరోసారి వారిని వైదొలిగేలా వైసీపీ కీలక నేత హుకుం జారీ చేశారు.