YCP Leaders Land Grabbing: భూమి విలువ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఖాళీ స్థలాలే కాదు.. ఇప్పటికే అక్కడ నిర్మించిన ఇళ్లను సైతం బలవంతంగా ఖాళీ చేయించి కబ్జాలకు పాల్పడుతున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శివారులోని ఈదులగుంటలో కోట్ల రూపాయల విలువైన భూమిపై కన్నేసిన అధికార పార్టీ నేతలు.. రెవెన్యూ రికార్డుల పేరిట హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.
శ్రీకాళహస్తి మండలం అప్పలాయగుంటలోని సర్వే నంబరు 45/1లోని 2.18 ఎకరాలు, 45లో 2.39 ఎకరాలు, తొట్టంబేడు మండల పరిధిలోని సర్వే నంబరు 42లో 20.25 ఎకరాలు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈదులగుంట చెరువు పొరంబోకుగా ఉంది. ఈ భూముల్లో దాదాపు 3 దశాబ్దాలుగా పేదలు ఇళ్లు నిర్మించుకుంటూ వచ్చారు.
30 ఏళ్లుగా అటు రెవెన్యూ అధికారులు గానీ, నీటిపారుదల అధికారులు గానీ ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదు. అందరూ శాశ్వత నిర్మాణాలు చేసుకున్నారు. పట్టణం విస్తరించి శివారు భూముల విలువ పెరగడంతో అధికార పార్టీ నేతల కన్ను చెరువు పొరంబోకు భూములపై పడింది. ఇప్పుడు ఏకంగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు.
శ్రీకాళహస్తికి చెందిన కొందరు అధికార పార్టీ వ్యక్తులు ఆ భూమి తమదంటూ ఖాళీ చేయించడానికి నిరుపేదలపై ఒత్తిడి తెస్తున్నారు. అర్థరాత్రులు సైతం రెవెన్యూ, పోలీసు సిబ్బందిని తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారు. నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్య నేత కనుసన్నల్లోనే ఇది జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని..కష్టపడి సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నామని ఇప్పుడు ఉన్న ఫళంగా వెళ్లిపోమ్మంటే ఎక్కడికి వెళ్లాలంటూ స్థానికులు వాపోతున్నారు.