YCP Government is Committing Irregularities In Voter List:ఈ సంవత్సరం మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం సృష్టించినప్పుడు తమ ఓటర్లు వేరే ఉన్నారని వైసీపీ మంత్రులంటే ఎవ్వరికీ అర్థం కాలే! ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలయ్యాక అసలు విషయం, అధికార పన్నాగాలు బయటపడ్డాయి. ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల చేర్పుతో మళ్లీ గద్దె నెక్కేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలే ఇందుకు మరో నిదర్శనంగా చెప్పవచ్చు.
YCP Is Target Stolen Votes To Win Elections: అడ్డదారుల్లో ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ అమలు చేస్తున్న కుట్రలకు అంతేలేదు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఓటర్ల జాబితాను వైసీపీ జాబితాగా మార్చేస్తున్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో ఓట్ల నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పుల కోసం కేవలం తొమ్మిది నెలల్లో ఏకంగా లక్షా 16వేలకు పైగా దరఖాస్తులు అందాయి. వాటిలో కేవలం కొత్తగా ఓటు నమోదు కోసమే 49వేల 956 దరఖాస్తులు వచ్చాయి. ఒక నియోజకవర్గం పరిధిలో ఇంత తక్కువ కాల వ్యవధిలో ఒకేసారి ఇన్ని వేల మంది కొత్త ఓటర్లు ఎలా వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్యే 2023 జనవరి 5 నాటికి 3 లక్షలు. అలాంటిది ఏకంగా 50వేల మంది కొత్తగా నమోదు కోసం దరఖాస్తు చేసుకుంటారా. బోగస్ ఓట్లు చేర్పిస్తున్నారనేందుకు ఇంతకంటే రుజువు ఏం కావాలి. కొత్తగా అందిన వాటిలో 23వేల 941 ఫాం-6 దరఖాస్తులను ఆమోదించారు. 25వేల 649 తిరస్కరించి మరికొన్ని వాటిని పెండింగ్‌లో పెట్టారు.
ఓట్ల అవకతవకలపై అధికార పార్టీపై ఫిర్యాదు చేసిన విపక్షాలు- విపక్షాలపై ఫిర్యాదు చేసిన అధికార పక్షం
YCP Filed Massive Form-6 Applications Unrelated Persons: నియోజకవర్గ పరిధిలోని సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయాలుండవు. అందుకే అక్కడి చిరునామాలతో అసలు ఆ ప్రాంతంతో సంబంధం లేని వ్యక్తుల పేరిట భారీగా ఫాం-6 దరఖాస్తులు పెట్టారు. ప్రధానంగా విద్యార్థులు, చిన్నాచితకా పనులు చేసుకునే వారి దగ్గర గుర్తింపు పత్రాలు తీసుకుని వారి పేరుతో అధికార పార్టీ నాయకులే దరఖాస్తులు పెట్టారు. కొత్త ఓటర్లుగా నమోదవడం కోసం డిసెంబరు 1 నుంచి 13 మధ్య నియోజకవర్గ వ్యాప్తంగా 10వేల 527 ఫాం-6 దరఖాస్తులు అందగా వాటిలో 3వేల 282 కేవలం సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే దాఖలయ్యాయి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లోనూ ఇలాగే దొంగ ఓట్లు వేయించారని గుర్తు చేస్తోంది. తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఇక్కడ ఓటర్లుగా చేర్పించి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసుకునే కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది.