Heavy Rains In Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు ఎండలు దంచికొడుతుంటే... మరో వైపు ఈదురు గాలులతో కూడిన వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మెున్నటి వరకు పడిన అకాల వర్షాలతో రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత వారం రోజుల నుంచి ఎండ వేడిమితో ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఈ రోజు ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉన్నా... మధ్యాహ్నం దాటిన తరువాత పలు జిల్లాల్లో ఒక్కసారిగా వర్షాలు పడ్డాయి.
బాపట్ల జిల్లా:జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఈదురుగాలులకు చీరాలలోని రామకృష్ణాపురంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దేవాంగపురి వద్ద తాటిచెట్లు, విద్యుత్ స్తంభం విరిగిపడింది. ఒక్క సారిగా వీచిన ఈదురుగాలులకు విద్యుత్ తీగలు రోడ్లపై తెగిపడ్డాయి. కొరిశపాడు మండలంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల వల్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. వేటపాలెంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా ఆయా గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అద్దంకి, చినగంజాంలో ఉరుములు, మెరుపులతో వర్షం వల్ల దారులన్ని జలమయం అయ్యాయి. పర్చూరులో ఈదురుగాలులకు చెట్లుపై విద్యుత్ విరిగిపడ్డాయి. పర్చూరులో తీగలపై చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. చినగంజాం మం. కుక్కలవారిపాలెం రామాలయం గోపురంపై పిడుగు పడింది.
గుంటూరు జిల్లా:జిల్లాలో 20నిమిషాల సేపు గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి చంద్రమౌళి నగర్, నెహ్రూ నగర్, మణిపురం వంతెన ప్రాంతాల్లో రహదారికి అడ్డంగా చెట్లు పడిపోవటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. వెంటనే స్పందించిన నగరపాలక సంస్థ సిబ్బంది... చెట్ల కొమ్మల్ని నరికి ఇబ్బందులు లేకుండా చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో హోర్డింగులు దెబ్బతిన్నాయి.