ఘనంగా ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి వేడుకలు Vaikuntha Ekadashi Celebrations: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటికిటలాడాయి. ఉదయం నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. తిరుమల, యాదాద్రి, అన్నవరం, భద్రాచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, ధర్మపురి తదితర అన్ని ప్రముఖ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి అర్ధరాత్రి 12.05 గంటలకు దర్శనాలను ప్రారంభించారు.
ముందుగా అత్యంత ప్రముఖులు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇక ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు.
తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా తితిదే ఏర్పాట్లు చేసింది. తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, ఉషశ్రీ, మేరుగ నాగార్జున, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి తదితర ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.
ఇక భద్రాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా రామయ్యను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు వచ్చారు. దీంతో ఆలయం భక్తజనసంద్రంగా మారింది. సింహాచలంలో స్వామివారి ఉత్తరద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక గజపతిరాజు తొలిదర్శనం చేసుకున్నారు. ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
తిరుపతి గోవిందరాజ స్వామి, కోదండరామ స్వామి, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పుష్పాలతో ఆలయాల్ని సర్వాంగ సుందరంగా అలకరించిన తితిదే.. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాచలం అప్పన్న ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక గజపతిరాజు... స్వామివారిని తొలి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. స్వామివారికి శారదా పీఠాధిపతి స్వాత్మానంద సరస్వతి పూజలు నిర్వహించారు.
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని భక్తులు తరించారు. యానాం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ దేవాలయానికి భక్తులు తరలివచ్చారు. విజయవాడలోని పలు వెంకటేశ్వరస్వామి దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీలక్ష్మీనృసింహస్వామిని ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శించుకున్నారు.
ప్రకాశం జిల్లా కనిగిరి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. వైకుంఠ ఏకాదశి వేళ వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామ స్వామి దేవస్థానం భక్తజన సంద్రంగా మారింది. దేవునికడప వెంకటేశ్వరుడిని దర్శించుకుని భక్తులు పులకించారు. జమ్మలమడుగు వెంకటేశ్వర స్వామి వారికి, మంత్రాలయం పాతవూరు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు తల్పగిరి రంగనాయకుల స్వామిని ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శించుకున్నారు.
ఇవీ చదవండి: