TTD Actions to Strengthen security in Tirumala: మారుతున్న కాలానుగణంగా సరికొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ తిరుమల శ్రీవారి ఆలయ భద్రతను పటిష్టం చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. భౌతిక, సైబర్ సెక్యూరిటీపై కేంద్ర, రాష్ట్ర భద్రత అధికారులు ద్వారా టీటీడీ అధ్యయనం చేయిస్తున్నారు. భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ, ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతను తిరుమలలో ఉండేలా టీటీడీ చర్యలు చేపట్టింది.
అఖిలాండ బ్రహ్మాండనాయకుడ్ని దర్శించుకునేందుకు తిరుమలకు రోజూ 60 వేల నుంచి 75 వేల మంది భక్తులు వస్తుంటారు. తిరుమల పుణ్య క్షేత్రంలో మూడంచెల భద్రత ఉన్నప్పటికీ.. ఎక్కడో ఒకచోట లోపం జరుగుతూనే ఉంది. దర్శన టికెట్ల అమలు నుంచి భద్రత పరమైన అంశాల వరకు ఏదో రకంగా వార్తల్లో నిలుస్తోంది. మారుతున్న కాలానుగుణంగా టీటీడీ అనుసరిస్తున్న వర్చువల్ విధానం అత్యంత పటిష్ఠమైనదైనా.. సైబర్ నేరగాళ్లు ఏదో రకంగా నకిలీ టికెట్లను రూపొందించి మరి భక్తులను మోసగించిన సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గంజాయి, మద్యం వంటివి తరలిస్తున్నా.. నియంత్రించలేకపోతున్నారు. మొన్నటికి మొన్న శ్రీవారి ఆలయంలోకి ఓ యువకుడు చరవాణిని తీసుకొని వెళ్లి మరీ ఆనంద నిలయాన్ని చిత్రీకరించి.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం, ఉగ్రవాదులు తిరుమలలో సంచరిస్తున్నట్లు నకిలీ మెయిల్ రావడం, సీఎంవో స్టికర్‌తో కూడిన వాహనం మాడవీధుల్లోకి రావడం వంటివి తిరుమల భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కోట్ల మంది భక్తులలో ఆందోళన కలిగిస్తున్నాయి.