TTD Sanitation Workers Strike : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీటీడీలో పనిచేస్తున్న సులబ్ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది. దాదాపు రెండు వేల మంది కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెబాటపట్టడంతో తిరుమలలో పారిశుద్ధ్య సమస్యలు ఎదురవుతున్నాయి. సులబ్ కార్మికులు విధులను బహిష్కరించడంతో టీటీడీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ నగరపాలక సంస్థల నుంచి కార్మికులను తిరుమలకు తరలించి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి నగరపాలక సంస్థలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులను తిరుమలలో వినియోగిస్తున్నారు. సులబ్ కార్మికులు సమ్మెతో తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోంది.
తిరుమలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించే సులబ్ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. విధులను బహిష్కరించిన కార్మికులు తిరుపతి హరేరామహరేకృష్ణ మైదానంలో నిరసన చేపట్టారు. సులబ్ కార్మికులు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మరుగుదొడ్ల నిర్వహణతో పాటు అన్నదాన సత్రం, వైకుంఠం క్యూకాంప్లెక్స్, అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో పారిశుద్ద్య కార్యక్రమాలు చేపట్టేవారు. సులబ్ కార్మికులు విధులు బహిష్కరించడంతో అన్నదాన సత్రంలో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. రెండు రోజులుగా అన్నదాన సత్రంలో సాంబార్ అన్నం, పెరుగు అన్నం మాత్రమే వడ్డిస్తున్నారు. కూరలు చేయడానికి అవసరమైన కాయకూరలు తరగడం, పచ్చడికి అవసరమైన కొబ్బరి తీయడం వంటి పనులు ఆగిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మరో వైపు అన్నదానసత్రం, ప్రధాన కూడళ్లలో చెత్త పేరుకుపోయింది.
సంవత్సరాల తరబడి తిరుమలలో విధులు నిర్వహిస్తున్నా కనీస వేతనం చెల్లించడం లేదని సమ్మె చేస్తున్న సులబ్ కార్మికులు వాపోయారు. మరుగుదొడ్లు తాము శుభ్రం చేస్తామని టీటీడీ నిర్వహణలో ఉన్న శ్రీలక్ష్మిశ్రీనివాస మాన్‌పవర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కార్మికులతో సమానంగా తమకు వేతనం చెల్లించడం లేదని సులబ్ కార్మికులు తెలిపారు. తిరుమలలో ఇతర సంస్థల పరిధిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను అందుతున్న జీతాలు తమకు రావడం లేదని, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.