TTD Prepares for Vaikunta Dwara Darshan: కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మొదలు పది రోజుల పాటు వైకుంఠ ద్వారప్రవేశానికి తితిదే చర్యలు చేపట్టింది. రోజుకు 80 వేల మంది శ్రీవారిని దర్శించుకొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. రోజుకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 20వేల మంది.. సర్వదర్శనం ద్వారా 50 వేల మంది, శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు ఇచ్చిన భక్తులు 2వేల మందితో పాటు సిఫారసు లేఖలతో మరికొందరికి దర్శనాలు కల్పించనుంది. 10రోజుల పాటు 2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసిన తితిదే.. మరో ఐదు లక్షల సర్వదర్శన టికెట్లను తిరుపతిలో జారీ చేయనుంది.
సర్వదర్శనం టోకెన్లను రోజుకు 50వేల చొప్పున జారీ చేయడానికి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో 92 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు శ్రీవారిని దర్శించుకొనే సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లను జనవరి ఒకటి మధ్యాహ్నం 2గంటల నుంచి జారీ చేస్తారు. 10రోజుల కోటా పూర్తయ్యేంత వరకు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి భక్తుల రద్దీ దృష్ట్యా.. దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే క్యూలైన్లలోకి అనుమతించేలా తితిదే అధికారులు చర్యలు చేపట్టారు.