TTD EO Dharma Reddy Comments: సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో అద్దె గదుల పెంపు విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి స్పందించారు. తిరుమలలో గదుల ధరల పెంపు విషయంలో రాజకీయం చేయడం చాలా బాధాకరంగా ఉందని, వీఐపీలు బస చేసే అతిధి గృహాల్లోని 172 గదులను మాత్రమే ఆధునీకీకరించి ధరలు పెంచామని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. అన్నమయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అద్దె గదుల ధరల వివరాలను ఆయన వెల్లడించారు.
ప్రముఖులకు సంబంధించి పద్మావతి, ఎంబీసీ కార్యాలయాల్లో గదుల ఇస్తారని, నారాయణగిరి, ఎస్వీ అతిథిగృహం, స్పెషల్ టైప్ అతిథి గృహాలు ఎంబీసీ కార్యాలయం కింద ఉన్నాయన్నారు. అందుకే రూ.8కోట్లతో ఆ అతిథిగృహాలను ఆధునికీకరించామన్నారు. ఏసీ, గీజర్ వంటి సౌకర్యాలు పెంచి గదుల అద్దె పెంచామన్నారు. ఒక్కొక్క గదికి రూ.5లక్షల చొప్పున ఖర్చు చేశామని వివరించారు.